తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దివంగత పరిటాల రవి జీవిత చరిత్రను 'చరిత్ర' టైటిల్ తో రాంగోపాల్ వర్మ తెరకు ఎక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారనే వార్త హాట్ టాపిక్ అయింది. సత్య, కంపెనీ, సర్కార్ వంటి గ్యాంగ్ స్టర్ సినిమాలను ప్రతిభావంతంగా తెరకెక్కించిన వర్మ ఈ ప్రాజక్టును చేపట్టుతున్నారని తెలియగానే పరిశ్రమనుండి మంచి స్పందన వచ్చింది. షోలే రీమేక్ చేసి విమర్శల పాలైన ఆయన ఈ ప్రాజెక్టు పై పూర్తి దృష్టి పెడుతున్నారట. కాన్ఫెడెన్షియల్ గా మీడియాకి దూరంగా ఈ సినిమా వివరాలు ఉంచాలని ఆయన భావించి ఆదేశాలు ఇచ్చారట. సాధారణంగా సంచలనం సృష్టించే విధంగా నిజ జీవిత పాత్రలను (సర్కార్ లో అమితాబ్ పాత్ర శివ సేన అధినేత భాల్ థాకరే ని అనుకరిస్తూ) తన సినిమాల్లో చూపించటానికి వర్మ ఇష్టపడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కాని అనంతపురం జిల్లాను తన కనుసన్నల్లో శాసించి దారుణ హత్యకు పరిటాల రవి పాత్రను తెరకెక్కిచాలని నిర్ణయించుకోవటం చాలా వివాదాలకు అవకాశమున్న సున్నితమైన అంశం అని కొందరు భావిస్తున్నారు. మరో ప్రక్క అసెంబ్లీ సమావేశాల్లో రవి భార్య సునీత ఆయన హత్య వెనుక ముఖ్యమంత్రి వైఎస్ కుమారుడు జగన్ వున్నాడని ఆరోపించారు. ఇలా వాడి వేడిగా ఉన్న సబ్జెక్టు కావటంతో మరింత ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఈ సినిమాకు వర్మే దర్శకత్వం వహిస్తారా లేక వేరే శిష్యులకు అప్పచెపుతారా, సినిమాలో రవి పాత్రను ఎవరు పోషిస్తారు వంటి విషయాలు బయిటకు రావాల్సి ఉంది.