రాజమౌళి 'ఈగ'పై వర్మ హాట్ ట్వీట్
ప్రముఖ దర్సకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు తెలుగులో రిలీజ్ అవుతున్న చిత్రాలపై తనదైన శైలిలో ట్విట్టర్ లో స్పందిస్తారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రాజమౌళి 'ఈగ'ని ఉద్దేశించి ట్వీట్ చేసారు. ఆయన ట్వీట్ లో...నేను 'ఈగ' చిత్రాన్ని తెలుగులో మొట్ట మొదటి వంద కోట్ల క్లబ్ ప్రారంభించే సినిమా అనుకుంటున్నాను. తెలుగులోనే ఈ చిత్రం వంద కోట్లు వసూలు చేస్తుందనుకుంటున్నాను అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
సినిమా మొదలైన అరగంటకే హీరో చనిపోతాడు. అయితే అతను ఈగ రూపంలో విలన్‌పై ఎలా పగ సాధించాడు అనేది సస్పెన్స్ అన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ఆయన తాజా చిత్రం'ఈగ' త్వరలో విడుదల కానున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఈగ'. తుది మెరుగులు దిద్దుకుంటోంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నాని, సమంత, సుదీప్ కీలక పాత్రధారులు. వారాహి చలనచిత్రం పతాకంపై తెరకెక్కుతోంది.
అలాగే రాజమౌళి మాట్లాడుతూ "బలవంతుడైన విలన్, బలహీనమైన ప్రాణి చేతిలో ఎలా ఓడిపోయాడు? ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అనే అంశం చుట్టూ తిరిగే కథే 'ఈగ'. సంక్షిప్తమైన ఈ కథను నాని, సమంత, సుదీప్ అర్థం చేసుకుని చక్కగా నటించారు. చక్కటి ప్రేమ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి'' అని అన్నారు.'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు.
నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ ''ఇటీవలే రాజమౌళి ఈగ కోసం సంభాషణలు పలికారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఉంటుందీ చిత్రం. విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులు తుది దశకు చేరాయి.జులై 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది'' అన్నారు. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.సురేష్‌బాబు.


Click it and Unblock the Notifications











