ఐపి పెట్టానని నిరూపిస్తే 10 కోట్లు ఇస్తా: 'రోబో' కన్నారావు సవాల్
తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే పదికోట్ల రూపాయలు ఇస్తానని "రోబో" చిత్రం తెలుగు రైట్స్ తీసుకున్న తోట కన్నారావు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఆయన బుధవారం పశ్చిమగోదావరి జిల్లా యర్నగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...కొద్ది రోజుల క్రితం మీడియాలో ఆయనపై వచ్చిన ఆరోపణలను త్రిప్పి కొట్టే ప్రయత్నం చేసారు. 1988 లో తాను పది లక్షల రూపాయలకు ఐపి పెట్టానన్న విషయం అవాస్తవమన్నారు. దమ్ముంటే ధైర్యంగా ఎదురుగా వచ్చి తనను ఎదుర్కోమని ఆయన అన్నారు. అలాగే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. తాను ఏడాదికి మూడు కోట్ల ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ తాను ఎవరికీ రూపాయి కూడా ఎగ్గొట్టలేదన్నారు. "రోబో" చిత్రానికి పదిహేను కోట్లు అమ్మకపు పన్ను, ఐదు కోట్లు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక తూర్పు గోదావరి జిల్లా "రోబో" చిత్రం డిస్ట్రిబ్యూటర్ చల్లా శంకరరావు మాట్లాడుతూ...తోట కన్నారావు లాంటి గొప్ప వ్యక్తికి గ్రామస్తులు అంతా కలిసి భారీ ఎత్తున సన్మాన కార్యక్రమాలు చేయాలని సూచించారు.


Click it and Unblock the Notifications











