Puneeth :నా చుట్టే తిరిగేవాడు, ముచ్చట వేసేది.. ఏడుపు ఆగడం లేదు, నోట మాట రావడం లేదంటూ రోజా ఆవేదన!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం నాడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. పునీత్ రాజ్ కుమార్ మృతితో కేవలం కన్నడ సినిమా ఇండస్ట్రీ లోనే కాక దాదాపు దక్షిణాదికి సంబంధించిన మిగతా అన్ని భాషల సినీ పరిశ్రమలలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా పునీత్ రాజ్ కుమార్ మృతి విషయంలో సినీనటి రోజా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

మౌర్య అనే పేరుతో
సినీనటి రోజా పునీత్ రాజ్ కుమార్ మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో తల్లి కొడుకులగా నటించారు. తెలుగులో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అనే సినిమాను కన్నడలో మౌర్య అనే పేరుతో రీమేక్ చేయగా ఆ సినిమాలో వీరిద్దరూ తల్లి కొడుకులగా నటించారు. తెలుగులో జయసుధ చేసిన పాత్రను కన్నడలో రోజా చేశారు. అలాగే తెలుగులో రవితేజ చేసిన పాత్రను అక్కడ పునీత్ రాజ్ కుమార్ చేశారు. 2004వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

తన కొడుకు పాత్రలో
తన కొడుకు పాత్రలో నటించిన నటుడు చనిపోయారన్న విషయం తెలుసుకోగానే రోజా తన ఆవేదన వ్యక్తం చేశారు ఒక మీడియా ఛానల్ ఫోన్ ఇన్ మాట్లాడిన ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చాలా బాధగా ఉందని పేర్కొన్న రోజా కన్నీళ్లు ఆగడం లేదని చెప్పుకొచ్చారు. ఆయన కన్నడలో మౌర్య అనే సినిమాలో తన కొడుకు పాత్రలో నటించాడని, అవడానికి నా కంటే రెండేళ్లు చిన్నవాడు అయినా సరే ఎప్పుడూ తన చుట్టూ మమ్మీ మమ్మీ అని అంటూ తిరిగే వాడని రోజా గుర్తు చేసుకున్నారు.

ముచ్చట వేసేది
పునీత్ వయస్సు తక్కువనే అయినా ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే చేతులెత్తి నమస్కారం పెట్టే అంత గొప్పగా ఉంటాయని ఆమె అన్నారు. వృద్ధాశ్రమాలు, అనాధ ఆశ్రమాలు పిల్లలకు చదువు చెప్పించడం మొదలు ఎన్నో మంచి మంచి పనులు చేస్తూ వుండేవారని, ఆయనను అలా చూస్తుంటే తనకు చాలా ముచ్చట వేసేది అని, అలాంటి వ్యక్తిని ఇకమీదట మనం చూడలేము అంటుంటే తనకు చాలా బాధగా ఉందని ఆమె అన్నారు.

ఎందుకిలా జరిగిందో?
మామూలుగా వ్యాయామం చేస్తే హెల్త్ బాగుంటుంది అనే మాటే మనం విన్నాం కానీ , ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాణం కోల్పోవడం అనే మాట ఎవరు జీర్ణించుకోలేని విధంగా మారిందని అన్నారు. ఎందుకిలా జరిగిందో భగవంతుడు ఎందుకు మంచి వారిని ముందుకు తీసుకు వెళ్లిపోతున్నాడో అర్థం కావడం లేదని ఆమె అన్నారు.

చాలా సన్నిహిత సంబంధాలు
ఇక వాళ్ళ అన్నయ్య శివరాజ్ కుమార్ తో నేను హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేశాను అని, రాజ్ కుమార్ అనే వ్యక్తి ఒక మహా శక్తి అని అలాంటి వారి పిల్లలు అంటే ఎలా ఉంటారో అనుకుంటే తప్పే అని ఆమె అన్నారు. ఏ మాత్రం గొప్పలకు పోకుండా చాలా దిగువ స్థాయి వ్యక్తులలానే వారంతా ప్రవర్తిస్తారని రోజా చెప్పుకొచ్చారు. అటు తమిళ ఇటు తెలుగు సినీ ప్రముఖులతో కూడా ఆ కుటుంబం చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని రోజా పేర్కొన్నారు.
Recommended Video

బాధగా ఉంది
అందుకే తెలుగు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు తమ కుటుంబ సభ్యులే చనిపోయినంత బాధగా ఉందని రోజా వెల్లడించారు. పునీత్ చనిపోయిన విషయాన్ని మా సోదరుడు నా దృష్టికి తీసుకువచ్చారని విషయం తెలిసిన చాలా సేపు వరకు నోట మాట రాలేదు అని రోజా వెల్లడించారు. మొత్తం మీద పునీత్ రాజ్ కుమార్ మృతితో దక్షిణాది భాషల సినీ ప్రముఖులు అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











