ఎన్టీఆర్ ‘బాద్‌షా’పై శ్రీను వైట్ల భార్య కామెంట్స్
దమ్ము చిత్రం తర్వాత జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్‌షా' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దూకుడు చిత్రం భారీ విజయంతో మంచి జోష్ మీద ఉన్న శ్రీను వైట్ల....'బాద్ షా' చిత్రాన్ని మరింత అద్భుతంగా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దూకుడు చిత్రానికి కేక పుట్టించే స్క్రిప్టు వర్కు చేసిన కోనవెంకట్, గోపీ మోహన్‌లు బాద్ షా చిత్రానికి కూడా పని చేస్తున్నారు.
'బాద్ షా' చిత్రం స్క్రిప్టు బాగా వచ్చిందని ఇప్పటికే దర్శకుడు, రచయితలు ట్విట్టర్లలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీను వైట్ల భార్య రూపా వైట్ల కూడా తన ట్విట్టర్లో ఈ చిత్రంపై కామెంట్స్ చేశారు. 'శ్రీను ఈ చిత్రం కోసం చాలా కష్ట పడుతున్నారు. ఆయన చిత్రాల్లో ఇదివరకెన్నడూ చూడని విధంగా అద్భుతంగా ఉంటుంది. బాద్ షా చిత్రం ఆల్ టైం రికార్డుల దిశగా సాగుతుంది' అని వ్యాఖ్యానించారు.
ఈచిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కాజల్ ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. గతంలో ఈ సినిమాకు 'యాక్షన్' అనే టైటిల్ అనుకున్నప్పటికీ చివరకు 'బాద్ షా' అనే టైటిల్ ఖారారు చేశారు.
దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్కు పూర్తి చేశారు. దూకుడు సినిమాకు పని చేసిన సాంకేతిక బృందం మొత్తం 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. సినిమా మొత్తం యాక్షన్ అండ్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన'దమ్ము' చిత్రం విడుదలపై ఆసక్తిగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటించారు. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈచిత్రాన్ని అగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ మీడియా బ్యానర్ పై నిర్మించారు. ఏప్రిల్ 27న దమ్ము చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











