RRR Oscar విజేతలకు సన్మానం.. ముఖం చాటేసిన స్టార్ హీరోలు.. ఎవరెవరూ వచ్చారంటే?
ఆస్కార్ అవార్డును సాధించి తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు పాటకు ఖ్యాతి దక్కడంతో భారతీయులంతా ఉప్పొంగిపోయారు. సినిమా పాటకు పట్టం కట్టడంతో సంగీత ప్రపంచ గర్వంగా తలెత్తుకున్నది. అలాంటి గొప్ప కార్యాన్ని సాధించిన నాటు నాటు సృష్టికర్తలు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌ను తెలుగు సినిమా సన్మానించారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం గురించిన వివరాల్లోకి వెళితే..
నాటు నాటు పాటకు ఆస్కార్: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన RRR చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకొన్నది. కేవలం కలెక్షన్లకే పరిమితం కాకుండా RRR చిత్రం పలు అంతర్జాతీయ వేడుకల మీద అవార్డులను సొంతం చేసుకొన్నది. ప్రపంచ సినిమాకు నోబెల్ పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డును నాటు నాటు పాట సొంతం చేసుకొన్నది.

నిరాడంబరంగా వేడుక: తెలుగు సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్టులకు సంబంధించిన యూనియన్ల ప్రతినిధులు RRR ఆస్కార్ విజేతలను సన్మానించాలని నిర్ణయించారు. ఈ వేడుకను ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో RRR టీమ్ మెంబర్స్‌ను ఆహ్వానించారు. అయితే అట్టహాసంగా జరుగాల్సిన ఈ కార్యక్రమం నిరాడంబరంగా సాగడం గమనార్హం.
ఏపీ, తెలంగాణ మంత్రులు: ఆస్కార్ విజేతల సన్మాన కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రతినిధులను పంపాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఏపీ మంత్రి చెల్లబోయిన తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి దంపతులు, ఇతర RRR యూనిట్ సభ్యులు హాజరయ్యారు

కీరవాణి, చంద్రబోస్‌కు సన్మానం: తెలుగు సినీ పరిశ్రమలకు తొలిసారి ఆస్కార్ అవార్డు సంపాదించి పెట్టిన కీరవాణి, చంద్రబోస్‌ను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు పుష్ప గుచ్చాలు అందజేసి శాలువా కప్పి సన్మానించారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వాల ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ మంత్రులు వెల్లడించారు.

ముఖం చాటేసిన స్టార్ హీరోలు: అయితే ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన ఆస్కార్ విజేతల సన్మాన కార్యక్రమానికి తెలుగు సినిమా పరిశ్రమలకు సంబంధించిన ప్రముఖులెవరూ రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. రాఘవేంద్రరావు, వైవీఎస్ చౌదరీ, సురేష్ బాబు, రానా దగ్గుబాటితోపాటు టాలీవుడ్‌కు చెందిన బీ కేటగిరి డైరెక్టర్లు, ఆర్టిస్టులు హాజరయ్యారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు ముఖం చాటేయడంపై రకరకాల ఊహాగానాలు మీడియాలో వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











