దూసుకెలుతున్న ‘మల్లు’ అర్జున్
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు తెలుగులో మాత్రమే కాదు...మళయాలంలోనూ మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన గత చిత్రాలు అక్కడ మంచి వసూళ్లు సాధించాయి. తాజాగా అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం కూడా నిన్న(ఏప్రిల్ 24)న అక్కడ విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతోంది. దీంతో అల్లు అర్జున్ పేరు ‘మల్లు' అర్జున్‌గా మార్మోగిపోతోంది.
అల్లు అర్జున్ తో పాటు మళయాలంలో మంచి గుర్తింపు ఉన్న ఉపేంద్ర, నిత్యా మీనన్ హీరోయిన్లు కూడా ఉండటంతో సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. కేరళలోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సినిమాకు నీరాజనాలు పడుతున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాపులారిటీ కేరళలో మరింత పెరిగినట్లయింది.

ఈ చిత్రం తెలుగు వెర్షన్ విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకుని దాదాపు రూ. 45 కోట్ల షేర్ వసూలు చేసింది. విలువైన మంచిమాటలే ఆస్తి అనే అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా తీసుకుని దర్శకుడు కథను రూపొందించారు. 'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్ ఆనంద్ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్ ఆనంద్. తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
'S/O సత్యమూర్తి' చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం పి.ఆర్.వో- ఎస్.కె.ఎన్, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.


Click it and Unblock the Notifications











