ప్రభాస్‌ను మనం ఎంపిక చేసుకోం.. ఆయనే మనల్ని పిక్ చేసుకోవాలి: సాహో డైరెక్టర్
తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన 'బాహుబలి'తో యూనివర్సల్ స్టార్ అయిపోయాడు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్. ఈ ఒక్క సినిమాతో అతడి క్రేజ్ ఖండాంతరాలు దాటిపోయింది. అంతేకాదు, భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా కూడా నిలిచింది. రికార్డులు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ తర్వాత అతడు నటించిన చిత్రం 'సాహో'.
దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. అలాగే చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల కాబోతుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక, ఇటీవల వచ్చిన యాక్షన్ పోస్టర్‌ను చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు సైతం సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఇలాంటి తరణంలో 'ఏ చోట నువ్వున్నా.. ' అంటూ సాగే పాట పూర్తి వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ నిర్వహించాడు చిత్ర దర్శకుడు సుజిత్. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు. ఇందులో భాగంగా సినిమాకు ప్రభాస్‌నే ఎందుకు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాడు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. 'ప్రభాస్ గారిని మనం ఎంపిక చేసుకోవడం కాదు.. ఆయనే మనల్ని పిక్ చేసుకోవాలి. వాస్తవానికి ఈ కథను 'బాహుబలి' విడుదల అవ్వకముందే చెప్పాను. ప్రభాస్ గారికి ఎలాంటి కథ అయితే బాగుంటుంది అని నాకు అనిపించిందో అదే ఆయనకు చెప్పాను. లక్కీగా ఆయన కూడా దీనికి ఓకే చేసేశారు' అని సుజిత్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











