అమ్మ కంగారు పడిపోయింది.. అందుకే అమెరికాకు.. సాయిధరమ్ తేజ్!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం చిత్రలహరి. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏప్రిల్ 12న చిత్రలహరి ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చిత్రలహరి చిత్రం ప్రారంభించడానికి ముందు కొన్నినెలలపాటు తేజు అమెరికాకు వెళ్ళాడు. తేజు అమెరికాకు వెళ్లడంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. వాటన్నింటికి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు.

అనేక ఊహాగానాలు
సాయిధరమ్ తేజ్ అమెరికాకు వెళ్లిన సమయంలో బరువు తగ్గడం కోసం లైపో చేయించుకోవడానికి వెళ్లాడని, జుట్టు రాలుతుండడంతో ట్రీట్మెంట్ కోసం వెళ్లాడని ఇలా అనేక వార్తలు వినిపించాయి. తేజ్ ఐలవ్యూ చిత్రం తర్వాత సాయిధరమ్ తేజ్ మూడు నెలలపాటు అమెరికాలో ఉన్నాడు. తిరిగొచ్చిన తర్వాత చిత్రలహరి చిత్రాన్ని ప్రారంభించాడు. తేజు బరువు తగ్గినట్లు పెద్దగా అనిపించలేదు. తాజాగా ఇంటర్వ్యూలో తేజు తన అమెరికా పర్యటన గురించి క్లారిటీ ఇచ్చారు.

గుర్రంపై నుంచి పడిపోయా
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ విన్నర్ షూటింగ్ సమయంలో గుర్రం మీది నుంచి పడిపోయా. కాలికి గాయమైంది. దానిని పెద్దగా పట్టించుకోకుండా పరుష చిత్రాల్లో నటించా. దీనితో నొప్పి మరింతగా ఎక్కువైపోయింది. ఆ సమయంలో అమ్మ చాలా కంగారుపడిపోయింది. తేజ్ ఐలవ్యూ షూటింగ్ ముగియగానే ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లినట్లు తేజు తెలిపాడు. బరువు తగ్గడానికి అని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన విన్నర్ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

మారుతి దర్శత్వంలో
చిత్రలహరి చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండడంతో తేజు మరో చిత్రాన్ని లైన్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు మారుతి మెగాస్టార్ చిరంజీవి నటించిన అభిలాష స్పూర్తితో ఓ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనికి తేజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తేజు నటించబోయే తదుపరి చిత్రం ఇదేనని ప్రచారం జరుగుతోంది. చిత్రలహరి చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన నివేద పెతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

25 కేజీల బరువుతగ్గే ప్రయత్నం
మారుతి చిత్రానికి సాయిధరమ్ తేజ్ 25 కేజీల బరువు తగ్గబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పాత్ర డిమాండ్ చేస్తోందట. నెలల వ్యవధిలో 25 కేజీలు బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. సాయిధరమ్ తేజ్ ఈ ప్రయత్నంలో ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి. వరుస పరాజయాలతో సతమతమవుతున్న తేజు ప్రస్తుతం చిత్రలహరిపైనే ఆశలు పెట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











