మ్యూజిక్ డైరెక్టర్‌కు ప్రమాదం.. కాపాడి రియల్ హీరో అనిపించుకున్న సాయి ధరమ్ తేజ్
Recommended Video
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ సంగీత దర్శకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదం జరిగినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, అదే సమయంలో అటుగా వస్తున్న మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ అతడిని కాపాడాడు. సకాలంలో తన కారులో ఆస్పత్రికి తరలించాడు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

కారును ఢీకొన్న మ్యూజిక్ డైరెక్టర్ బైక్
నగర శివారు ప్రాంతమైన నానక్‌రాంగూడ నుంచి జూబ్లీహిల్స్‌కు వచ్చే మార్గంలో అచ్చు అనే యువ సంగీత దర్శకుడు తన బైక్‌తో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. రెండు వాహనాలు వేగంగా వస్తుండడంతో అతడు ఎగిరి పది అడుగుల దూరంలో పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
కాపాడిన సాయి ధరమ్ తేజ్
అదే సమయంలో షూటింగ్ ముగించుకుని వస్తున్న సాయి ధరమ్ తేజ్.. కారు ఆపి ఏం జరిగిందో చూశాడు. అక్కడ గాయ పడింది మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు అని గుర్తించాడు. దీంతో వెంటనే తన కారులో అతడిని తీసుకెళ్లి దగ్గరలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ ప్రమాదంలో అచ్చుకు కాలు విరిగినట్లు తెలుస్తోంది.

రియల్ హీరో అనిపించుకున్నాడు
సాయి ధరమ్ తేజ్ అతడిని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో మెగా హీరోను అందరూ ప్రశంసిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. ప్రమాదాలు జరిగితే సామాన్యులే పట్టించుకోని రోజుల్లో సెలెబ్రిటీ అయి ఉండి ఇలా చేయడం అభినందించదగ్గ విషయమే మరి.

అచ్చు చాలా సినిమాలు చేశాడు
అచ్చు రాజమని తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాలకు సంగీతం అందించాడు. ఒకటి కాదు.. రెండు కాదు సుమారు యాభైకి పైగా సినిమాలకు ఆయన సంగీతం సమకూర్చాడు. తెలుగులో ఆయన మొదటి సినిమా మంచు మనోజ్ నటించిన ‘నేను మీకు తెలుసా'. అంతకంటే ముందు మలయాళంలో ‘కురుక్షేత్ర' అనే సినిమా చేశాడు.

ఆ ఫ్యామిలీకి ఎక్కువగా
అచ్చు.. మంచు ఫ్యామిలీలోని నటుల సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ‘నేను మీకు తెలుసా'తో మొదలెట్టి ‘కరెంట్ తీగ', ‘పోటుగాడు', ‘పాండవులు పాండవులు తుమ్మెద', ‘లక్కున్నోడు', ‘డైనమైట్', ‘మామ మంచు అల్లుడు కంచు', వంటి సినిమాలు చేశాడు. అలాగే, ‘కుర్రాడు', ‘ఓం 3D' సహా ఎన్నో చిత్రాలకు సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











