సాయిపల్లవి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. వేణు ఊడుగుల మూవీలో రౌడీ బేబీ పాత్ర ఏంటంటే?
ప్రేమమ్ సినిమాలో సహజసిద్ధమైన నటనతో కోట్లాది ప్రేక్షకుల హృదయంలో చోటు సంపాదించుకొన్న యువ హీరోయిన్ సాయి పల్లవి. ఫిదా, కణం, పడి పడి లేచే మనసు, మారి 2 చిత్రాల్లో ఆమె నటన విమర్శకుల ప్రశంసలందుకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళ హీరో సూర్యతో ఎన్‌జీకే చిత్రంలో నటిస్తున్నది. పడిపడి లేచే మనసు తర్వాత భావోద్వేగమైన నటనకు ఆస్కారం ఉన్న తెలుగు చిత్రంలో నటించడానికి సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

రానా దగ్గుబాటి సరసన సాయిపల్లవి
నీది నాది ఒకే కథ లాంటి చక్కటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన వేణు ఊడుగుల రూపొందించే విరాటపర్వం చిత్రంలో ఈ కీలక పాత్రను పోషించేందుకు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రానా సరసన సాయిపల్లవి నటిస్తున్నది. పూర్తిస్థాయి నటనకు ఆస్కారం ఉన్న పాత్రను సాయిపల్లవి పోషిస్తున్నట్టు తెలిసింది

80, 90వ దశకం పరిస్థితులతో
వేణు ఊడుగుల చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన సాయిపల్లవి మరోమారు ఆలోచించకుండా ఒప్పుకొన్నట్టు సమాచారం. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో 80, 90వ దశకం నాటి పరిస్థితులను ప్రతిబింబించే కథనంతో విరాటపర్వం రూపొందనున్నది. ఈ చిత్రంలో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో కనిపించనున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో సాయిపల్లవి అంగీకరించిన పాత్ర ఆమె అభిరుచికి నిదర్శనమని, ధైర్యానికి సూచిక అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

త్వరలో విరాటపర్వం సెట్స్‌పైకి
ప్రస్తుతం విరాటపర్వం సినిమా ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో పనులు జరుపుకొంటున్నది. రాజకీయ, సామాజిక అంశాల నేపథ్యంగా రూపొందబోయే ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. త్వరలోనే రానా దగ్గుబాటి, సాయిపల్లవి కాంబినేషన్‌లో సినిమా ఆరంభం కాబోతున్నది.

మూడు భాషల్లో సాయిపల్లవి రికార్డు
ఇదిలా ఉండగా, సాయి పల్లవి నటనతోనే కాక డ్యాన్సులతో విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఆమె డ్యాన్స్ వీడియోలో మూడు భాషల్లో యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారాయి. తెలుగులో 200 మిలియన్లకు పైగా అత్యధిక వ్యూస్ సాధించిన వీడియో ఫిదా సినిమాదే కావడం ఓ రికార్డు. అలాగే తమిళంలో రౌడీ బేబీ పాట దాదాపు 150 మిలియన్లకు చేరువైంది. అలాగే మలయాళంలో మలారే సాట 50 మిలియన్లకు చేరువ కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











