యమ భక్తుడుగా సాయిరామ్ శంకర్
పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ రీసెంట్ గా యమనామ జపంలో మునిగి తేలుతున్నాడు. అతని తాజా చిత్రం 'యమహో యమః'కోసం అతను యమ భక్తుడుగా మారాడు. ఆ చిత్రంలో సాయిరామ్ క్యారెక్టర్ గురించి దర్శకుడు జితేందర్.వై మాట్లాడుతూ...పొద్దున లేవగానే రామా.. కృష్ణా... అని తలచుకొనే భక్తుల్ని చూశాం. శివుడికీ, శ్రీ వెంకటేశ్వరస్వామికీ దండం పెట్టుకొనేవాళ్లనీ చూస్తుంటాం. కానీ ఓ యువకుడు మాత్రం నిత్యం యమనామ జపం చేస్తుంటాడు. యమధర్మరాజుకి అపరభక్తుడిగా మారిన ఆ యువకుడి కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. అలాగే ...ఒక యమభక్తుడు సృష్టించే సందడితో ఆద్యంతం సరదాగా సాగే చిత్రమిది. యమధర్మరాజు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే విషయాన్ని తెరపైనే చూడాలి. వినోదం, భావోద్వేగాల మేళవింపుతో కథ సాగుతుంది. యమధర్మరాజుగా శ్రీహరి నటన ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు. ఈ చిత్రంలో సాయిరామ్‌శంకర్, పార్వతి మెల్టన్ జంటగా నటిస్తున్నారు. శ్రీహరి యమధర్మరాజు పాత్రని పోషిస్తున్నారు. జి.విజయ్‌కుమార్‌గౌడ్ నిర్మాత. ఇటీవలే కర్నూలు జిల్లా ఆదోని పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ కోసం త్వరలోనే అమెరికా వెళుతున్నారు. నిర్మాత మాట్లాడుతూ..''రాయలసీమలో ఇటీవలే పతాక సన్నివేశాల్ని చిత్రీకరించాం. వచ్చే నెల మొదటివారం నుంచి అమెరికాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. ఏప్రిల్‌లో పాటల్ని, మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాము''అన్నారు. రచన: వెలిగొండ శ్రీనివాస్, సంగీతం: మహతి, కళ: వి.ఎస్.మణి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్.


Click it and Unblock the Notifications