దాడి కేసు: పద్మశ్రీ వెనక్కి ఇచ్చేందుకు సైఫ్ సిద్ధమేనన్న కరీనా
హైదరాబాద్: ప్రభుత్వం కోరితే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పద్మశ్రీ అవార్డును వెనుకకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన భార్య, నటి కరీనాకపూర్ ఖాన్ తెలిపారు. సైఫ్ నుంచి పద్మశ్రీ అవార్డును వెనుకకు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో కరీనా పై విధంగా స్పందించింది.
ప్రభుత్వం సైఫ్ అలీ ఖాన్ అవార్డును వెనక్కి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోందనే విషయం....గతేడాది ఆర్.టి.ఐ(సమాచార హక్కు)చట్టం ద్వారా గత ఏడాది ఆగస్టులో వెల్లడైంది. 2012 ఫిబ్రవరిలో కొలాబాలోని వాసవీ హోటల్‌లో ఓ వ్యక్తిపై సైఫ్‌ఖాన్ చేయిచేసుకున్న ఘటనపై ముంబై కోర్టు అభియోగాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే సైఫ్‌ఖాన్‌కు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనుకకు తీసుకోవాలనే డిమాండ్ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం 2010లో సైఫ్‌ఖాన్‌కు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది.
కాగా అవార్డుపై హోటల్ ఘటన ఏమేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని తాను సైఫ్‌తో చర్చించలేదని, అయితే అవార్డును వదులుకునేందుకు మాత్రం ఆయన సిద్ధంగానే ఉన్నారని మంగళవారం ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న సందర్భంగా కరీనా చెప్పారు.

దాడి సంఘటనకు సంబంధించిన వివరాలు....
ఫిబ్రవరి 21, 2012న తాజ్ హోటల్ కు వచ్చిన సైఫ్..ఇక్భాల్ శర్మ అనే వ్యక్తిపై దాడి చేశాడు. పిడిగుద్దులతో అతని ముఖంపై గాయం చేశాడు. దీంతో శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైఫ్ తాడి ఉండటం వల్లనే ఇలా దాడి చేసారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అప్పుడు పోలీసులు సైఫ్‌ను అరెస్టు చేసారు కూడా. అయితే వెంటనే రూ. 3000 చెల్లించి బెయిల్ పై విడుదలయ్యారు.
తొలుత తనపైనే దాడి జరిగిందని, తనను తాను కాపాడుకున్నానని సైఫ్ అలీఖాన్ మీడియాకు వెల్లడించారు. తన బృందంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తనను కొట్టారని ఆరోపించారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని, రెస్టారెంట్‌లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలు అన్నింటినీ రుజువు చేస్తాయని సైఫ్ అప్పుడు చెప్పుకొచ్చారు.
ఈ కేసులో సైఫ్ పై చార్జ్ షీట్ దాఖలు అయింది. సైఫ్ అలీఖాన్ ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇప్పుడు కొత్తేమీ కాదు. 2008లో ఒకసారి ఇదే తరహాలో ఓ ఫోటో జర్నలిస్టుపై దాడి చేశాడు. అయితే అప్పట్లో సైఫ్ కు, ఫోటో గ్రాఫర్ కు మధ్య కొందరు రాజీ కుదర్చడంతో వివాదం సద్దుమనిగింది.


Click it and Unblock the Notifications











