పూరి జగన్నాథ్ తమ్ముడు ఎవరిపై వాలుతాడో?
హైదరాబాద్: స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ అన్నయ్య వారసత్వంతో పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. అయితే ఇప్పటి వరకు సాయిరాం శంకర్‌కు హీరోగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం సాయిరాం శంకర్ హీరోగా 'యమహో యమ' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.
పార్వతి మెల్టన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రానికి జితేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం అక్టోబర్లో విడుదలకు సిద్ధం అవుతోంది. రియల్ స్టార్ శ్రీహరి ఈ సినిమాలో యమధర్మరాజుగా నటిస్తున్నారు.
తాజాగా సాయిరాం శంకర్ హీరోగా మరో సినిమా మొదలైంది. 'ఎ వచ్చి బిపై వాలె' పేరుతో రూపొందుతున్న ఈచిత్రాన్ని హను సినీ క్రియేషన్స్ పతాకంపై సుందర్ దర్శకత్వంలో రాజేష్‌కుమార్ నిర్మిస్తున్నారు. సురభి హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ సన్నివేశం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఉదయం చిత్రీకరించారు. తొలి షాట్‌పై డి.అప్పారావు క్లాప్ ఇవ్వగా కె.వి.వి.సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు. దాము గౌరవ దర్శకత్వాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సుందర్ మాట్లాడుతూ లవ్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించనున్న ఈ చిత్రంలో ఎ,బి,సి,డిలకు సంబంధం వున్న కథే వుంటుందని, కొత్త తరహా కథాంశంతో తాము రూపొందిస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, రెగ్యులర్ షూటింగ్ జరుపనున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ హైలెట్‌గా వుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సురభి, వికాస్, నాగరాజ పాల్గొన్నారు. అలీ, రఘుబాబు, ఆహుతిప్రసాద్, షాయాజీషిండే, రావు రమేష్, పృథ్వి, జోగినాయుడు, శివన్నారాయణ, సుమన్‌శెట్టి, సన, రజిత, అల్లరి సుభాషిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: వికాస్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, నిర్మాత: రాజేష్‌కుమార్, రచన, దర్శకత్వం: సుందర్.


Click it and Unblock the Notifications












