సల్మాన్‌పై మీడియా బ్యాన్: పోతే పొండి అంటూ గొడవ
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పై మీడియా ఫోటోగ్రాఫర్లు బ్యాన్ విధించడం చర్చనీయాంశం అయింది. అయితే సల్మాన్ కూడా మీతో నాకు పని లేదు...పోతే పొండి అంటూ మీడియా వారి పట్ల అనుచితంగా ప్రవర్తించడం గమనార్హం. సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'కిక్' ప్రమోషన్(ప్రచారం) కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
'కిక్' ప్రమోషన్స్ కవర్ చేస్తున్న తమపై సల్మాన్ పర్సనల్ బాడీగార్డ్ లు దురుసుగా ప్రవర్తించారని ఫొటోగ్రాఫర్లు నిరసనకు దిగారు. గొడవ మధ్యలో సల్మాన్ కలుగజేసుకుని, ఫొటోగ్రాఫర్లు కావాలంటే ఈవెంట్ కవర్ చేయవచ్చని, లేకపోతే వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పాడు.
సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు మీడియా ఫోటోగ్రాఫర్లకు పుండుపై కారం చల్లినట్లయింది. దీంతో వారు మరింత రగిలి పోయారు. వెంటనే సల్మాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అప్పటి వరకు సల్మాన్ ఈవెంట్స్ ను కవర్ చేయమని ఫోటోగ్రాఫర్ల యూనియన్ నిర్ణయించింది.

మరో వైపు సల్మాన్ కాన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. తన ఫొటోలు తీయకపోవడం వల్ల ఫోటోగ్రాఫర్లే పని కోల్పోతారని... అయినా వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు సల్మాన్. ఫొటోగ్రాఫర్లు తనపై విధించిన నిషేధాన్ని ఎంత ఎక్కువ కాలం కొనసాగిస్తే తాను అంత ఎక్కువగా హర్షిస్తానని సల్మాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
సల్మాన్ ఖాన్, మీడియా ఫోటోగ్రాఫర్ల గొడవ చిలికి చిలికి పెద్దది అవుతుండటంతో......నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ గొడవ ప్రభావం 'కిక్' సినిమాపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. గొడవలో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











