రెండేళ్లలో నాలుగు సూపర్ డూపర్ హిట్లు...!?
'సల్లూ" అనే ముద్దుపేరుతో పిలువబడే హిందీ స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పుడు అసలుసిసలు సూపర్ స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. గతంలోనూ సల్మాన్ నటించిన పలు చిత్రాలు హిట్టయినప్పటకీ..వరుసగా నాలుగు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం అన్నది అతని కెరీర్ లో ఎప్పుడూ జరగలేదు.
సల్మాన్ ఖాన్ కే కాదు, బాలీవుడ్ లో ఏ ఇతర హీరోకూ వరుసగా నాలుగు ఘన విజయాలు లభించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా రెండేళ్ల వ్యవధిలో నాలుగు సూపర్ హిట్లు కొట్టిన మగాడు బాలీవుడ్ లో లేడు. 'పోకిరి" కి రీమేక్ గా రూపొందిన 'వాంటెడ్"కి ముందు సల్లూబాయ్ కెరీర్ స్లంప్ లో ఉంది. ఆ సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత సక్సెస్ ను టేస్ట్ చేసిన సల్మాన్ కు, ఆ తర్వాత వచ్చిన 'దబాంగ్" హీరోగా పూర్వ వైభవం తెచ్చిపెట్టింది.
ఆ చిత్రం తర్వాత వచ్చిన 'రెడీ" కూడా వంద కోట్ల విజయం సాధించడంతో సల్మాన్ పేరు మారుమ్రోగిపోయింది. ఇక తాజాగా 'బాడీగార్డ్" కూడా బంపర్ హిట్ గా డిక్లేర్ చేయడంతో..ఇప్పటి వరకు నెంబర్ వన్ హీరో స్థానంలో ఉన్న అమీర్ ఖాన్..తనంతటతానే ఆ స్థానాన్ని ఖాఖీ చేసి ఆ సీటులో సల్మాన్ ను తనే స్వయంగా కూర్చోబెట్టేసాడు...ఇటీవల ఓ సందర్భంలో అమీర్ మాట్లాడుతూ 'బాలీవుడ్ నెంబర్ వన్ హీరో స్థానం సల్మాన్ సొంతం. ఆయన నటించిన 'బాడీగార్డ్" చిత్రం నా 'త్రీ ఇడియట్స్" చిత్రానికి సంబంధించిన రికార్డులను సైతం బద్దలు కొట్టింది. ఇదే విషయాన్ని సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సల్మాన్ కి మెసేజ్ ద్వారా తెలియజేసాను" అని చెప్పాడు.


Click it and Unblock the Notifications











