‘విశ్వరూపం’ చిత్రానికి సల్మాన్ ఖాన్ సపోర్టు
హైదరాబాద్: కమల్ హాసన్ 'విశ్వరూపం' చిత్రంపై తమిళనాడు ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో జయలలిత ప్రభుత్వం అక్కడ సినిమాను నిలిపి వేసిన సంగతి తెలిసిందే. విశ్వరూపం చిత్రంపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని కోలీవుడ్ తో పాటు దేశంలోని ఇతర సినీరంగాల ప్రముఖులు సైతం విమర్శిస్తున్నారు. విశ్వరూపం చిత్రాన్ని నిలిపి వేయడం సబబు కాదనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.
తాజాగా 'విశ్వరూపం' చిత్రానికి ముస్లిం మతానికి చెందిన హీరో, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మద్దతు ప్రకటించారు. తన అభిమానులంతా విశ్వరూపం చిత్రానికి మద్దతు ప్రకటించాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. విశ్వరూపం చిత్రంలో ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు లేవనడానికి.... సల్మాన్ ఖాన్ సపోర్టే నిదర్శనమని కమల్ హాసన్ అభిమానులు అంటున్నారు.
కమల్ హాసన్ తన 'విశ్వరూపం' చిత్రంలో ఎక్కడా కూడా మతపరమైన చర్చకు ఆస్కారం ఇవ్వలేదు. ఆప్ఘన్ లోని ఉగ్రవాద కార్యకలాపాలను మాత్రమే చూపకుండా...ఆప్ఘన్ ఉగ్రవాద కుటుంబాల్లోని స్త్రీలు, పిల్లల మానసిక స్థితిగతులు, ఆలోచనలపైనా దృష్టి సారించారు. ఇందులో ముస్లిం సంస్థలు ఆందోళన చేయడానికి కారణమేంటో తెలియడం లేదని కమల్ హాసన్ తో పాటు ఆయన అభిమానుల వాదన.
విశ్వరూపం వివాదం వెనక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హస్తం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే మీడియా ప్రచారాన్ని జయలలిత గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖండించారు. కమల్ తనకు శత్రువు కాదని, ప్రత్యర్థి కాదని, అతనితో తనకు ఎలాంటి విబేధాలు లేవని చెప్పిన జయ... శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగానే విశ్వరూపం చిత్రాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. విశ్వరూపం చిత్రంపై నిషేదం విధించలేదన్నారు.


Click it and Unblock the Notifications











