నీదీ ఎంత చెత్త క్యారక్టరో.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. సీనియర్ నటుడిపై సమంత, రానా ఫైర్
లేడి సూపర్‌స్టార్ నయనతారపై తమిళ నటుడు రాధారవి వివాదాస్పద వ్యాఖ్యలపై సినీ వర్గాలు భగ్గుమంటున్నాయి. చెన్నైలో జరిగిన సినీ వేడుకలో రాధారవి మాట్లాడుతూ నయనతార గురించి కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సినీ తారలను కించపరిచే విధంగా చేసిన ఆయనను విశాల్, సిద్ధార్థ్, చిన్మయితోపాటు పలువురు సినీ ప్రముఖులు తప్పుపడతున్నారు. ఈ నేపథ్యంలో సమంత, రానా దగ్గుబాటి ఫైర్ అయ్యారు. ఇంతకు రాధారవి ఏమన్నారంటే..

నయనతారపై రాధారవి కామెంట్
నయనతారను లేడీ సూపర్‌స్టార్ అంటూ ప్రశంసిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఎంజీఆర్, శివాజీ గణేషన్ లాంటి హీరోలతో పోల్చుతున్నారు. అలా నయనతారను పోల్చడం కొందరిని బాధకు గురిచేస్తున్నది. నయనతార దెయ్యం, సీతా దేవి పాత్రలు చేస్తున్నారు. దేవత పాత్రలంటే కేవలం కేఆర్ విజయ గుర్తొస్తారు. నయనతార సినిమాలు ఆడుతున్నాయి కాబట్టి నాలుగైదు రోజులు గుర్తుంచుకొంటారేమో. ఆమె చేస్తున్న పాత్రలు ఇప్పుడు ఎవరైనా చేస్తారు. వాటి గురించి గొప్పగా మాట్లాడుకోనవసరం లేదు అని రాధారవి కామెంట్లు చేయడం వివాదంగా మారింది.

నీ ఆత్మకు శాంతి.. అంటూ సమంత అక్కినేని
తాజాగా రాధారవి వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత భగ్గుమన్నారు. అయ్యో!.. రాధారవి స్ట్రగుల్ సమంజసమైనదే. విషాదంలో మునిగిపోయిన వ్యక్తి అతను. అతను చేస్తే చాలా బాధేస్తుంది. నీ నుంచి దూరమైన ఆత్మకు శాంతి చేకూరాలి. నయనతార సూపర్‌హిట్ సినిమా టికెట్లను పంపిస్తాం. పాప్ కార్న్ తింటూ చిల్ ఫీల్ కావాలి అని సమంత ట్వీట్ చేసింది.

నీది చెత్త క్యారెక్టర్ అంటూ రానా దగ్గుబాటి
నయనతారకు అండగా రానా దగ్గుబాటి నిలిచారు. ఓ మంచి నటిపై రాధారవి ఓ ప్రెస్‌మీట్‌లో చాలా చెత్తగా వాగారని విన్నాను. నీ కామెంట్లు చూస్తే నీది ఎంత చెత్త క్యారెక్టరో తెలుస్తున్నది. యాక్టర్‌గా అద్భుతమైన నటనాప్రతిభను చాటిన ఆమెపై అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అని రానా ట్వీట్ చేశారు.

రాధారవిపై డీఎంకే వేటు
నయనతార నటించిన కొలైయుతిర్ కాలం అనే చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతూ రాధారవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాధారవి వ్యాఖ్యలు వివాదం కావడంతో ఆయనను డీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. ఇదేరకమైన వ్యాఖ్యలు చేస్తే దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని నడిగర్ సంగం హెచ్చరించింది.


Click it and Unblock the Notifications











