దూకుడుపై మహేష్ వంతు అయింది...ఇప్పుడు సమంత వంతొచ్చింది..!
క్యూట్‌గాళ్ సమంత జోరుమీదుంది. 'ఏమాయ చేసావే" చిత్రంతో యువకుల హృదయాల్లో ఊహాసుందరిగా కొలువైన ఈ భామ తాజాగా 'దూకుడు"తో మహేష్ సరసన మెరిసిపోనుంది. తెరంగేట్రం చేసిన కొద్ది కాలంలోనే అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సొగసరి ప్రయోగాత్మక పాత్రలకు చాలా దూరం అంటోంది. చారిత్రాత్మక నేపథ్యం వున్న చిత్రాల్లో నటించాలని వుందని అయితే ఆ పాత్రలు కెరీర్ ప్రారంభంలో వున్న తనకు సరిపోవని చెబుతోంది.
ప్రస్తుతం కెరీర్ హాయిగా సాగిపోతోందని, నటిగా కొద్ది పరిణితి సాధించాక ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి సిద్ధమని అంటోంది. 'ఐదేళ్ల తర్వాతే అలాంటి సినిమాల గురించి ఆలోచిస్తా. ప్రస్తుతానికైతే రొమాంటిక్, కమర్షియల్ చిత్రాలకే నా ప్రాధాన్యత. అన్ని పాత్రల్లోకెల్లా వేశ్య పాత్ర చేయడం ఏ నాటికైనా ఛాలెంజింగ్ గా వుంటుందని" సెలవిస్తోంది ఈ భామ.
మహేష్ తో కలసి తొలిసారిగా 'దూకుడు" చిత్రంలో నటించడం ఆనందంగా వుందని, ఇద్దరి జంట ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిస్తుంది" అని చెబుతోంది ఆ సుందరి. 'దూకుడు' సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ ఓపక్క మహేష్ బాబు, మరోపక్క సమంతా ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నట్టున్నారు. ఎప్పుడూ తన సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడని మహేష్ 'దూకుడు' గురించి కథలు కథలుగా చెబుతుంటే... 'నేను మాత్రం తక్కువ తిన్నానా' అంటూ తాజాగా సమంతా కూడా అందుకుంది.
ఈ సినిమాలో ఓ కొత్త సమంతాని చూస్తారని అంటోంది. 'దూకుడు'లో నా డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోతాయి. చాలా గ్రేస్ ఫుల్ గా వుంటాయి. మహేష్ తో పోటీపడి చేశాను. అయినా నాకు నేను చెప్పుకుంటే ఏం బాగుంటుంది... చూసి మీరే చెప్పండి" అంటోంది సమంతా.


Click it and Unblock the Notifications











