సమంత ఫ్యాన్సికి కిక్కో కిక్కు!
అందం, అభినయం, ఒంపు సొంపులు, చిలిపి చేష్టలతో ఫ్యాన్స్‌ను మత్తెక్కిస్తున్న హీరోయిన్ సమంత....త్వరలో అభిమానులకు కిక్కు మీద కిక్కు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. దూకుడు చిత్రం తర్వాత సమంత నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. తాజాగా ఆమె నటించిన వరుస చిత్రాలు మే మాసాంతం నుంచి వరుస పెట్టి విడుదల కాబోతున్నాయి.
రాజమౌళి దర్శకత్వంలో సమంత నటించిన 'ఈగ' చిత్రం మే 30న విడుదలకు సిద్ధం అవుతోంది. వాస్తవానికి ఈ చిత్రం ఇంకా ముందే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ....విజువల్ ఎఫెక్ట్స్, పోస్టు ప్రొడక్షన్ పనులు కారణంగా మే 30న విడుదల చేసేందుకు రంగం సిద్దం చేశారు.
ఈ చిత్రం తర్వాత సమంత గౌతం మీనన్ దర్శకత్వంలో నాని సరసన 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంలో నటిస్తోంది. ఈచిత్రం జులైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే చిత్రం తమిళంలో నాని స్థానంలో జీవా హీరోగా రూపొందుతోంది. రెండు వెర్షన్లు ఒకేసారి విడుదల కానున్నాయి.
మరో వైపు నాగచైతన్యతో కలసి సమంత నటిస్తున్న 'ఆటో నగర్ సూర్య' చిత్ర షూటింగ్ కూడా శర వేగంగా పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రం జూన్ చివరికల్లా విడుదలయ్యే అవకాశం ఉంది. వీటి తర్వాత మహేష్ బాబుతో కలిసి సమంత నటిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం దసరానాటికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా వరుస పెట్టి అభిమానులకు కిక్కు ఇవ్వబోతోంది సమంత.


Click it and Unblock the Notifications











