ఫ్యాన్స్ కు శుభవార్త... సమంత సినీ ఫెస్టివల్
హైదరాబాద్ : 'ఏ మాయ చేశావె' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సమంత ఇక్కడ హాట్ బ్యూటీగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన సినిమాలు నెల నెల తేడాలో వరసగా విడుదల అవుతూ ఫెస్టివల్ వాతావరణం క్రియేట్ చేస్తూ ఆమె అభిమానులును అలరింపచేయనుంది. వచ్చే మూడు నెలలూ ఆమె నటించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయి. మొదటగా అక్టోబర్ లో ఆమె సినీ గురువు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' మొదట విడుదల అవుతోంది. తర్వాత నవంబర్ లో నాగ చైతన్య సరసన నటించిన ఆటో నగర్ సూర్య విడుదల కానుంది. ఇక డిసెంబర్ లో మహేష్ సరసన ఆమె చేసిన సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు విడుదల కానుంది.
నాని, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు' . సి.కల్యాణ్ నిర్మాత. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే నెల 2న పాటల్ని విడుదల చేస్తారు. యాక్షన్, అడ్వంచరస్ మూవీస్ తీసే దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రేమకథను తెరకెక్కిస్తే... అది ఎలా ఉంటుంటో 'ఏ మాయ చేశావె' రుజువు చేసింది. ఆ సినిమాతో తెలుగునాట ఆయనకు అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఏర్పడ్డారు. 'ఏ మాయ చేశావె' ఇచ్చిన స్ఫూర్తితో గౌతమ్ మీనన్ మరో ప్రేమకథను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. 'ఎటో వెళ్లిపోయింది మనసు' అనే పేరుతో ఆ సినిమా తెలుగులో విడుదల కానుంది.
నాగచైతన్య,దేవకట్టా కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య'. ఆ చిత్రంలో నాగచైతన్య టైటిల్ రోల్ లో సూర్య పాత్రలో కనపించనున్నారు. ఈచిత్రాన్ని నవంబర్ 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వినోదం, యాక్షన్ అంశాలతో మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో నాగచైతన్యని ఓ కొత్త కోణంలో తెరపై చూపెట్టబోతున్నాడు దర్శకుడు దేవా కట్ట. ఆటోనగర్ నీడలో పెరిగిన ఓ నవతరం యువకుడి కథ ఇది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 'ఆటోనగర్ సూర్య'లో నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్నారు. మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్.
వెంకటేష్, మహేష్ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. సమంత, అంజలి నాయికలు. రెండు పాటలు, కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. దిల్‌రాజు మాట్లాడుతూ "మనం అని అనుకునే విశాల దృక్పథం పోయింది. అమ్మానాన్నలు కూడా పిల్లల ఇంటికి అతిథులుగానే వస్తున్నారు. భవిష్యత్తులో ఉమ్మడి కుటుంబానికి అర్థం చెప్పేవారుండరు. కానీ వాటన్నింటినీ గుర్తుచేసే చిత్రంగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తెరకెక్కుతోంది. ఈ మధ్యనే చెన్నై శివారులో ఓ షెడ్యూల్ చేశాం. అక్కడి కొబ్బరి తోటలో ఓ సెట్ వేసి పెళ్ళికి సంబంధంచిన ఓ పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. దీంతో ఐదు పాటలు పూర్తయ్యాయి. డిసెంబర్ 21న చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు.


Click it and Unblock the Notifications











