మరీ అంత లేదులే... నేను ఆటైపు కాదు: సమంత
హైదరాబాద్: బాలీవుడ్ ఛాన్స్ వచ్చిదంటే కొందరు హీరోయిన్లు ఓ రేంజిలో ఫీలవుతూ ఉంటారు. కొందరైతే బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం తెగ ఉబలాట పడుతూ ఉంటారు. మరికొందరు కేవలం బాలీవుడ్ అవకాశాలు దక్కించుకోవడమే లక్ష్యంగా సౌత్ సినిమాలు చేస్తూ ఉంటారు. ఒక్క అవకాశం దొరికినా.... సౌత్ సినిమాలకు టాటా చెప్పేసి అక్కడ ఎలాంటి చెత్త క్యారెక్టర్ దొరికినా మహా భాగ్యంలా ఫీలయి చేసేస్తూ ఉంటారు.
అయితే తాను మాత్రం అలా కాదంటోంది హీరోయిన్ సమంత. 'ఎటో వెళ్లి పోయింది మనసు' హిందీ వెర్షన్లో సిద్ధార్థరాయ్ కపూర్‌తో కలిసి నటిస్తున్న సమంత.... ఈ చిత్రం ద్వారా తొలిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. 2013లో ఈచిత్రం బాలీవుడ్లో విడుదల కానుంది. ఈ విషయమై మీడియా ప్రశ్నించగా... చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది.
తన తొలి బాలీవుడ్ ఎంట్రీని నేనేమీ బ్రహ్మాండంలా భావించడం లేదని, సౌతిండియాలోనే మరింత ఎదగాలనేదే నా ఆకాంక్ష అని చెప్పుకొచ్చింది. నేనెప్పుడూ డబ్బు కోసం వెంపర్లాడే రకం కాదని, రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తే ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయనని, తనకు గుర్తింపు తెచ్చే పాత్రలు మాత్రమే ఎంచుకుంటానని చెప్పుకొచ్చింది.
తమన్నా, ఇలియానా బాలీవుడ్ ప్లాన్స్ భారీగా ఉన్నాయి కదా అని సమంతను ప్రశ్నించగా..... వాళ్లు స్వతహాగా నార్త్ ఇండియన్స్. తమ సొంత ప్రాంతంలో తమ టాలెంట్ నిరూపించుకోవాలని ఎవరికైనా ఉంటుంది. నేను సౌత్ లో పుట్టాను కాబట్టి ఇక్కడ నా టాలెంట్ నిరూపించుకోవాలనేదే నా లక్ష్యం అంటూ సమాధానం ఇచ్చింది.
జూ ఎన్టీఆర్ సరసన చేసే సినిమా కోసం సమంత తన రెమ్యూనరేషన్ రూ. 1.25 కోట్లకు పెంచేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై సంతను ప్రశ్నించగా..... ఆ వార్తల్లో నిజం లేదని, తాను డబ్బు కోసం పాకులాడే రకం కాదని తేల్చి చెప్పింది.


Click it and Unblock the Notifications











