లవ్ ఎట్ ఫస్ట్ సైట్: దత్తత తీసుకున్న సమంత
హైదరాబాద్: హీరోయిన్ సమంత తొలి చూపులోనే ప్రేమలో పడింది. ప్రేమ అంటే మరోలా అర్థం చేసుకోవద్దు. ఆమె ప్రేమలో పడింది ఓ వీది కుక్కపై. రోడ్డుపై అనాదలా తిరుగుతున్న దాన్ని వెంటనే దత్తత తీసుకుంది. దానికి 'నోరి' అనే పేరు కూడా పెట్టేసింది. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
'మా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ వచ్చింది. పేరు నోరి. రోడ్డుపై దాని చూడగానే మనసు పారేసుకున్నాను. వెంటనే దత్తత తీసుకున్నాను' అంటూ సమంత ట్వీట్ చేసింది. ఆశ్రయం లేకుండా రోడ్డుపై తిరుగుతున్న మూగ జీవాలను దత్తత తీసుకోవాలని సమంత ఈ సందర్భంగా తన అభిమానులుకు పిలుపుచ్చింది. డబ్బులు పెట్టి కొనే బదులు ఇలా రోడ్డుపై ఇల్లు లేకుండా తిరుగుతున్న వాటికి ఆశ్రయం కల్పించండి అని కోరుతోంది సమంత.

సమంత మాత్రమే కాదు...సమంత అభిమానులు కూడా ఇలాంటి సేవాకార్యక్రమాల్లో ముందు ఉంటున్నారు. ఆ మధ్య దిల్ సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ లో తీవ్రంగా గాయపడ్డ ఒక అమ్మాయికి సమంత అభిమానులు అండగా నిలిచారు. ఇలాంటి మంచి పనులు చేస్తున్న సమంతను, సమంత అభిమానులను పలువురు ప్రశంసిస్తున్నారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ కూడా సమంత టీంను ప్రశంసించారు.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే....తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ దూసుకెలుతోంది సమంత. ఆమె తెలుగులో నటించిన 'రభస', తమిళంలో నటించిన 'అంజాన్'(తెలుగులో 'సికిందర్) చిత్రం ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో పాటు తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో ఒక సినిమాకు కమిట్ అయింది.


Click it and Unblock the Notifications











