కొత్త కథతో గబ్బర్ సింగ్-2, సంపత్ నంది దర్శకత్వం?
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత సంవత్సరం 'గబ్బర్ సింగ్' చిత్రంతో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. హిందీలో సూపర్ హిట్టయిన సల్మాన్ ఖాన్ మూవీ 'దబాంగ్' చిత్రానికి రీమేక్ ఇది. హిందీలో దబాంగ్-2 రావడంతో తెలుగులో కూడా గబ్బర్ సింగ్-2 వస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.
గబ్బర్ సింగ్-2 తెరకెక్కించే ఆలోచనలో ఉన్న మాట వాస్తవమే కానీ, అది దబాంగ్-2కు రీమేక్ కాదని తాజాగా అందుతున్న ఫిల్మ్ నగర్ సమాచారం. సరికొత్త కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, పవన్ కళ్యాణ్ మార్కు పూర్తి ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
గతంలో రామ్ చరణ్ హీరోగా సూపర్ హిట్ 'రచ్చ' చిత్రాన్ని తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు సంపత్ నంది...పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందబోయే 'గబ్బర్ సింగ్-2' చిత్రానికి దర్శకుడిగా ఎంపికయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తన సొంత బేనర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్‌పై దీన్ని సమర్పించనున్నారని, ఆయన స్నేహితుడు శంకర్ మరార్ ఈచిత్రానికి నిర్మాత గా వ్యవహరిస్తారని తాజాగా అందుతున్న సమాచారం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు సంపత్ నంది అండ్ టీం 'గబ్బర్ సింగ్-2' ప్రాజెక్టుకు సంబంధించిన పనిలో నిమగ్నమై ఉన్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. కొన్ని రోజుల క్రితం గబ్బర్ సింగ్-2 చిత్రానికి కోన వెంకట్ దర్శకుడు అనే వార్తలు వెలువడ్డాయి. ఏది ఏమైనా అధికారిక ప్రకటన వస్తే తప్ప ఏ విషయం అనేది రూఢీ కానుంది.


Click it and Unblock the Notifications











