చిరంజీవి అభిమానులకు కోపం తెప్పించాడు
హైదరాబాద్ : గతంలోనూ చిరంజీవిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని ఎత్తుతూ ట్వీట్స్ చేసి వివాదం కోరి తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ మరోసారి...ట్విట్టర్ ద్వారా జనాలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసారు. సంపూర్ణేష్ బాబు... చిరంజీవి కంటే బెటరని కామెంట్ చేసారు. ఇది చిరంజీవి అభిమానులకు కోపం తెప్పిస్తోంది. సంపూర్ణేష్ బాబుతో పోలిక ఏంటి అని అంటున్నారు.
సంపూర్ణేష్ ది ఓన్లీ హీరో, రియల్ హీరో అంటూ ప్రశంసిస్తూ... సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవిల కంటే సంపూ బెటరని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘కొబ్బరిమట్ట' సినిమాలోని సంపూర్ణేష్ పాట అదుర్స్ అని రామ్ గోపాల్ వర్మ ఈ బర్నింగ్ స్టార్‌ని ఆకాశానికెత్తేశాడు.మరి ఈ కామెంట్స్ చూసిన మెగా అభిమానులు వర్మపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
సంపూతో వర్మ సినిమా?
'హృదయకాలేయం' అంటూ ఓ వెరైటీ టైటిల్‌తో ముందుకొచ్చాడు సంపూర్ణేష్‌బాబు. ఆ ఒక్క సినిమాతోనే బర్నింగ్ స్టార్ అయిపోయాడు. సంపూని ఇష్టపడే నెటింజన్లు... ఆ సినిమాని హిట్ చేశారు. దాంతో నిర్మాతల దృష్టి సంపూపై పడింది. 'కరెంటు తీగ', 'బందిపోటు' చిత్రాల్లో మెరిశాడు సంపూ. 'సింగమ్ 123' అంటూ విష్ణు సంపూతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈమధ్యే టీజర్ విడుదలైంది. అందులో సంపూ డైలాగులు డైనమైట్లలా పేల్చాడు. ఈ సినిమాతో సంపూ ఇమేజ్ మరో మెట్టు ఎక్కడం ఖాయం అనిపిస్తోంది. అందుకే రాంగోపాల్ వర్మ కూడా ఇప్పుడు సంపూపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

సంపూతో ఓ హారర్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో వర్మ ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. హారర్ కామెడీలోనే ఇదో కొత్త రకం ప్రయత్నమట. ప్రస్తుతం స్క్రిప్టు తయారు చేసే పనిలో ఉన్నాడు వర్మ. ప్రస్తుతం వర్మ దాదాపుగా పది సినిమాల్ని లైన్‌లో పెట్టుకొన్నాడు.
'శ్రీదేవి', '365 డేస్', 'అటాక్', 'కిల్లింగ్ వీరప్పన్'లతో పాటు ఓ సెలైంట్ సినిమాని తీస్తానని ప్రకటించాడు వర్మ. సచిన్ జోషి కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఒకేసారి ఇన్ని కథలపై ఫోకస్ ఎలా పెట్టగలుగుతున్నాడో మరి. వాటి మధ్య సంపూ సినిమాని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Click it and Unblock the Notifications











