అభిమానితో ఒట్టేయించుకుని కొబ్బరి మట్ట సినిమా రిలీజ్ చేసిన సంపూర్ణేశ్ బాబు
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'కొబ్బరి మట్ట'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. ఇషికా సింగ్, గీతాంజలి, గాయత్రి గుప్తా, కత్తి మహేష్, షకీలా తదితరులు నటించారు. ఈ సినిమా గత శనివారం విడుదలైంది. దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే, సినీ విమర్శలకులు సైతం ఈ సినిమాకు మంచి రేటింగ్ ఇచ్చారు. దీంతో కలెక్షన్ల పరంగానూ 'కొబ్బరి మట్ట' దూసుకుపోతోంది. దీంతో చిత్ర యూనిట్ సంబరపడిపోతోంది.
నాలుగు రోజుల క్రితం మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని బాబుకాలనీకి చెందిన రెడ్డెప్ప అనే యువకుడు 'కొబ్బరి మట్ట'ను తమ ఊరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ను కోరాడు. అయితే, అది జరగకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ సెల్ టవర్ ఎక్కేశాడు.

స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతడిని కిందికి దించే ప్రయత్నం చేసినా విఫలమయింది. ఆ తర్వాత అతడి తమ్ముడిని పైకి పంపించి, రెడ్డెప్పను కిందికి దించారు. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటనకు సంబంధించిన వార్తలు ప్రసారం అయ్యాయి. దీంతో ఈ ఘటన పెద్ద హైలైట్ అయింది.
ఇది చిత్ర యూనిట్ వరకు వెళ్లడంతో సంపూర్ణేశ్ బాబు దీనిపై స్పందించాడు. వెంటనే అక్కడ 'కొబ్బరి మట్ట' సినిమాను విడుదల చేయించాడు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో 'సెల్ టవర్ ఎక్కి మరీ సంపూ సినిమాని సాధించుకున్న మదనపల్లె అభిమాని రెడ్డెప్ప. మరొకసారి ఇలాంటి పనులు చెయ్యొద్దని ఒట్టేయించుకుని, సినిమా రిలీజ్ కు సహకరించిన సంపూ' అని పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











