బూతులు: ఆ 12 మందిపై సంపూర్ణేష్ బాబు కేసు
హైదరాబాద్: 'హృదయ కాలేయం' చిత్రంతో తనకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబుకు......కొంత మంది నుండి వేదింపులు ఎక్కువయ్యాయట. ఆ మధ్య సంపూర్ణేష్ బాబు, ఆ చిత్ర దర్శకుడిపై దాడి జరిగిన సంఘటన ఇంకా మరిచిపోక ముందే...తాజాగా కొందరు ఫేస్ బుక్‌లో సంపూర్ణేష్ బాబును బూతులు తిడుతూ వేధించడం మొదలు పెట్టారు. వీరిపై ఐటి యాక్టు కింద కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు సంపూర్ణేష్ బాబు. ఈ మేరకు ఈ విషయాన్ని తెలియజేస్తూ సంపూర్ణేష్ బాబు ఓ స్టేట్మెంట్ విడుదల చేసారు. అయితే ఆ 12 మంది ఎవరనే విషయం మాత్రం సంపూర్ణేష్ బాబు బయటకు చెప్పడం లేదు.
సంపూర్ణేష్ బాబు స్టేట్మెంట్...
వ్యక్తిగత విమర్శలకు నేనెప్పుడూ తల వంచాను. నేను నా రూపం గురించి విమర్శించే వారిని సహించాను. నేను మీకు నచ్చకపోతే అన్ లైక్ చేయడానికి, బ్లాక్ చేయడానికి అవకాశము ఉన్నది. అయినా తిడుతున్న వారిని ప్రేమిస్తూనే వచ్చాను. కానీ నా నటనతో కానీ, నా రూపంతోగానీ సంబంధం లేని కుటుంబ సభ్యులను, స్త్రీలని, నా చిత్ర టీంను సభ్యసమాజం తలవంచుకునేలా బూతులు తిడుతున్న వారిని 12 మందిని గుర్తించి మరికొన్ని గంటల్లో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నాను.

ఈ సమస్య నాకు కాదు...సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు అనుభవిస్తున్నదే. దూరంగా ఉన్నాము కాబట్టి ఏమీ చెయ్యలేరే ధీమానో....ఫేస్ బుక్‌లో తిట్టొచ్చనే బ్రమనో తెలియదు కానీ...చదువుకున్న వారు, చిన్న చిన్న పిల్లలు, సాఫ్ట వేర్ ఇంజనీరింగ్ చదువుతూ సంఘంలో గొప్ప పోజిషన్లో ఉన్న వారు ఈ 12 మందిలో ఉండటం ఆశ్యర్యం.
నేను మీ అందరికీ నచ్చవలసిన అవసరం లేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. నన్ను దూషించొచ్చు. ద్వేషించవచ్చు. కానీ హద్దులోఉంటే వాటిని నేను స్వీకరిస్తాను. మీరు నాపై పెట్టిన రూ. 75 టికెట్ గిట్టుబాటు కానందుకు నన్ను తిట్టే హక్కుంది. కానీ ఇతరులను దూషించే అర్హత మీకు లేదు.
ఈ నిర్ణయం కొంత మందికి బాధ కలిగించి ఉండొచ్చు. ఇక్కడ మీ వాక్ స్వాతంత్ర్యం అలానే ఉంటుంది. కానీ తారా స్థాయి బూతులు మాత్రం నేను ఇక సహించకూడదు అనుకుంటున్నాను. మీరు ద్వేషించినా మిమ్మల్ని ప్రేమిస్తా.
-మీ సంపూర్ణేష్ బాబు


Click it and Unblock the Notifications











