జైల్లో సంజయ్ : ఆ సినిమాలకు కోట్లు కురుస్తాయా?
ముంబై : 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురువారం టాడా కోర్టులోనే లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గతంలో కొన్ని నెలల జైలు శిక్ష అనుభవించిన సంజయ్ ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. తాజాగా కోర్టు ఆదేశాల మేరకు మిగిలిన మూడేళ్ల జైలు శిక్షను అనుభవించడానికి జైల్లో లొంగి పోయారు.
సంజయ్‌ని కోర్టులో లొంగిపోవాల్సిందిగా కోర్టు ఆదేశాలు వచ్చే నాటికే పలువురు బాలీవుడ్ నిర్మాతలు ఆయనతో సినిమాలు కమిట్ అయి దాదాపు 250 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టారు. జైలు శిక్ష నేపథ్యంలో త్వరిత గతిని కొన్ని సినిమాలు పూర్తి చేసినప్పటికీ, మరికొన్ని ప్రాజెక్టులు పూర్తి కాలేదు. సంజయ్ దత్‌తో సినిమా తీస్తున్న ఇద్దరు నిర్మాతలు తమ సినిమాలు పూర్తి చేసుకోవడానికి వీలుగా లొంగిపోయేందుకు సంజయ్ దత్‌కు మరింత గడువు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంజయ్ దత్ దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇదివరకే తోసిపుచ్చింది.
మొత్తానికి సంజయ్ జైలుకెళ్లిన నేపథ్యంలో కొన్ని సినిమాల నిర్మాణం వాయిదా పడగా, పూర్తయిన 'పోలీస్ గిరి'తో పాటు పలు సినిమాలు విడుదల కానున్నాయి. విచిత్రం ఏమిటంటే దేశానికి హానికలిగించే తీవ్రమైన నేరాల్లో నేరస్తుడిగా తేలిన సంజయ్ పట్ల దేశవ్యాప్తంగా పెద్దగా వ్యతిరేకత లేదు. కొందరు చేసిన కుట్రల వల్లనే సంజయ్ ఆ కేసులో ఇరుక్కున్నాడు, ఆ నేరాల్లో అతని ప్రమేయం ప్రత్యక్ష్యంగా లేదని చాలా మంది నమ్మడమే ఈ పరిస్థితికి కారణం. బాలీవుడ్ సెలబ్రిటీలంతా సంజయ్‌కి మద్దతుగా నిలవడం కూడా అతనిపై సానుభూతి పెరగడానికి కారణమైంది.
మరి సంజయ్ జైలుకెళ్లిన తర్వాత విడుదల కాబోతున్న 'పోలిస్ గిరి' లాంటి సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు? గతంలోలానే ఈ సినిమాలకు రెస్పాన్స్ ఉంటుందా? కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయా? ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏమైనా మార్పు ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 'పోలీస్ గిరి' చిత్రం తెలుగులో బాలకృష్ణ నటించిన 'లక్ష్మీనరసింహ' రీమేక్. కెఎస్ రవికుమార్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. జూన్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications












