సంక్రాంతికి పోటీ పడుతున్న మహేష్, రామ్ చరణ్
హైదరాబాద్: వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినానికి ఇద్దరు బడా హీరోలు పోటీ పడడానికి సిద్ధపడ్డారు. ఆడియో విడుదల కార్యక్రమాలు, వివిధ ప్రకటనలు బట్టి చూస్తుంటే సంక్రాంతికి మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్ పోటీ పడడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది.
ఈ ఏడాది ప్రారంభంలో రామ్ చరణ్ తేజ్ నాయక్, మహేష్ బాబు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకేసారి విడుదలయ్యాయి. అవి రెండు కూడా విజయం సాధించాయి. మరోసారి సంక్రాంతికి ఇద్దరి సినిమాలు ఒకేసారి వస్తాయని భావిస్తున్నారు.

సంక్రాంతికి తన సినిమా విడుదల కావడాన్ని మహేష్ బాబు సాధారణంగా ఇష్టపడుతాడు. ఆయన కెరీర్‌లో నాలుగు సినిమాలు అలా విడుదలయ్యాయి. అలా విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బిజినెస్‌మేన్, ఒక్కడు బాక్సాఫీసు వద్ద విజయం సాధించాయి. టక్కరి దొంగ ఒక్కటే చేయి ఇచ్చింది.
నిజానికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాను 2012 అక్టోబర్‌లో విడుదల చేయాలని తొలుత అనుకున్నారు. సమంత అనారోగ్యం కారణంగా ఆ సినిమా విడుదలలో జాప్యం జరిగింది. దీంతో ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. దాంతో రామ్ చరణ్ సినిమా నాయక్‌తో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రామ్ చరణ్ తేజ్‌కు కూడా సంక్రాంతి కలిసి వస్తోంది. నాయక్ సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. రామ్ చరణ్ తేజ్ ఎవడు సినిమా జులైలో విడుదల కావాల్సి ఉండింది. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల దృష్ట్యా దాని విడుదలలో జాప్యం జరుగుతూ వచ్చింది. మహేష్ బాబు నేనొక్కడినే జనవరి 10వ తేదీన విడుదలవుతుందని అంటున్నారు. దానితో పాటు రామ్ చరణ్ తేజ్ ఎవడు విడుదలయ్యే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications











