ఈ సంక్రాంతి సినిమా 350 కోట్లు
ఈ సారి తెలుగు సినిమా 2012 సంక్రాంతి పండుగని ఘనంగానే చేసుకోనుంది. దాదాపు 350 కోట్ల పెట్టుబడితో రంగంలోకి దిగుతోంది. దాదాపు పెద్ద హీరోల సినిమాలన్నీ పండుగకే ముస్తాబు అవుతున్నాయి. అయితే ఈ పెట్టుబడిలో ఎంత వెనక్కి వస్తుంది. ఎంత నష్టపోతాం. ఎంత లాభం వస్తుంది. ఎవరు విన్నర్ అవుతారనేది కీలకం. దాంతో ఇప్పటినుంచే ట్రేడ్ లో లెక్కలు మొదలయ్యాయి. ఎవరికి వాళ్లు తామే సంక్రాంతి విజేతలమని మురిసిపోతున్నారు.
ఆ సినిమాలను చూస్తే.. ఈ సంక్రాంతికి బాలకృష్ణ 'అధినాయకుడు'గా వస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తిక్రియేషన్స్ పతాకంపై ఎం.ఎల్.కుమార్‌చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ తాతగా, తండ్రిగా, కుమారుడిగా త్రిపాత్రాభినయం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకలోకంలో భారీ అంచనాలే ఉన్నాయి.
ఆ తర్వాత చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న వెంకటేష్ 'బాడీగార్డు' చిత్రం ఉంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై కూడా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. మలయాళంలో, హిందీలో విజయం సాధించిన చిత్రాన్ని రీమేక్ చేస్తూండటంతో ఈ సినిమా గ్యారెంటీగా మంచి హిట్ అవుతుందని యూనిట్ నమ్మకం.
ఇక 'దూకుడు'తో సూపర్ హిట్ ఇచ్చిన మహేష్ తాజా చిత్రం 'బిజినెస్‌మేన్' కూడా సంక్రాంతి బరిలో ఉంది. పోకిరి తర్వాత మహేష్, పూరిల కలయికలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్యాన్స్ లోనే కాక ప్రేక్షక లోకంలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక సంక్రాంతికన్నా ముందు డిసెంబర్ మొదటి వారం లో పవన్ కల్యాణ్ 'పంజా' చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
ఆ తర్వాత రవితేజ, దర్శకుడు గుణశేఖర్‌ల కలయికలో వై.వి.యస్.చౌదరి నిర్మిస్తున్న 'నిప్పు' కూడా సంక్రాంతి బరిలో దూకుతోంది.
అలాగే జూఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ముని కూడా సంక్రాంతి సీజన్ లోనే విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకుని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. సింహా వంటి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.
వీటితో పాటు ప్రభాస్, లారెన్స్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న 'రెబల్' కూడా సంక్రాంతి వెళ్లాక పిబ్రవరి లోపు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
అలాగే రామ్ చరణ్, దర్శకుడు సంపత్ నంది కలయికలో మెగా సూపర్ గుడ్ నిర్మిస్తున్న 'రచ్చ'చిత్రం పిబ్రవరిలో మహా శివరాత్రి రోజున విడుదల చేయాలని నిర్ణయించారు.
వీటితో పాటు.. బి.జయ దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్‌లీ', రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత జంటగా రూపొందుతున్న చిత్రం 'ఈగ', రానా, జెనీలియా జంటగా రూపొందుతున్న 'నా ఇష్టం', కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న 'పూలరంగడు' చిత్రాలు కూడా సంక్రాంతికి అటూ ఇటూగా విడుదల చేయాలని ప్లానింగ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











