మహేష్ కోసం సంతోష్ శివన్ తో నమ్రత మంతనాలు...
సినిమాటోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా సంతోష్ శివన్ సినీ ప్రియులకు సుపరిచితుడే. తన కెమెరా పనితనానికి పలుసార్లు నేషనల్ అవార్డులు కూడా అందుకున్నాడు. ఇటీవల ఈయన రూపొందించిన 'ఉరుమి' సినిమా, దర్శకుడిగా సంతోష్ కి మంచి పేరే తెచ్చింది. దీనినిప్పుడు అదే పేరుతో తెలుగులోకి కూడా డబ్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొనడానికి ఇటీవలే ఈయన హైదరాబాదు వచ్చాడు.
ఈ సందర్భంగా తెలుగులో స్ట్రెయిట్ సినిమా ఎప్పుడు చేస్తారు? అన్న మీడియా ప్రశ్నకు సమాధానం చెబుతూ, 'ఇక్కడి నుంచి నాకింతవరకు ఆఫర్లేమీ రాలేదు. వస్తే చేయడానికి నేను సిద్ధమే. అయితే, ఇటీవలే నమ్రతా తన భర్త మహేష్ బాబుతో ఓ సినిమా చేయమని అడిగారు. అది ఓకే అయితే కనుక తప్పకుండా చేస్తాను' అన్నాడు. ఒకవేళ మహేష్ ఓకే చెప్పినా, ఇప్పుడతనున్న బిజీలో ఎప్పటికి ఇది కార్యరూపం దాల్చేను..?
ప్రస్తుతం మహేష్ బాబు తాజా చిత్రం 'దూకుడు" శ్రీను వైట్ల డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకొన్నది. మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











