'సారాయి వీర్రాజు' ఎప్పుడొస్తాడంటే..
విలన్ పాత్రలతో పాపులర్ అయిన అజయ్ హీరోగా మారి చేస్తున్న చిత్రం సారాయి వీర్రాజు. విక్రమార్కుడు సినిమాలో జింతాక అనే మ్యానరిజం ని కాయిన్ చేసిన కన్నన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు.విశాలాక్షి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాత పి.ఆర్.కె.రావు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'నిర్మాతగా నాకు ఇది తొలి సినిమా. ఇందులో అజయ్ కొత్తగా కనిపిస్తాడు. దర్శకుడిగానే కాకుండా నిర్మాణపరంగా కూడా నాకు కణ్ణన్ ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారు' అన్నారు.
1980ల నాటి కాలంలో జరిగే కథగా ఈ చిత్రం నడుస్తుంది. ఇందులో అజయ్ సారాయి వీర్రాజు అనే పాత్రను పోషిస్తున్నాడు. అజయ్ మాట్లాడుతూ ... వీర్రాజు అంత గాలివాటం మనిషిని మనం చూడం అంటారు ఆ వూళ్లోవాళ్లు. కల్లు తీయడమో లేకపోతే నాటుసారా కాయడమో చేస్తుంటాడు. అలా సంపాదించిన సొమ్ములతో పూటుగా తాగేసి ఊరమ్మట తిరుగుతుంటాడు. అతగాడి తీరేమిటో తెర మీదే చూడాలంటున్నారు అజయ్. ఇక అతని ప్రక్కన రమ్య అనే మళయాళ అమ్మాయి హీరోయిన్ గా చేస్తోంది.ఇక ఈ అమ్మాయే కాకుండా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ చిత్రంలో ఉంటారని సమాచారం. కన్నన్ తమిళుడైనా రాజమౌళి శిష్యుడు కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.
'దర్శకుడిని ప్రోత్సహించే నిర్మాతలు ఉంటే మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు శ్రీ సాయి మంచి సంగీతం అందించారు. మేమందరం కష్టపడి పనిచేసిన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంలో విలన్ పాత్రను ధరిస్తున్న అజయ్ ఘోష్ ప్రశంసనీయమైన నటన ప్రదర్శించారు'. పల్లెటూరి నేపథ్యంలో నడిచే కథ ఇది. దీనికి రావిశాస్త్రి ఆరు సారాకథలు స్ఫూర్తినిచ్చాయి. ప్రతి పాత్రనీ మనం పల్లెలో చూసినట్లే అన్నారు దర్శకుడు కణ్ణన్. మధులిక, జోగి నాయుడు, ధన్‌రాజ్, సత్తెన్న తదితరులు నటించారు. సంగీతం: శ్రీసాయి, కెమెరా: విశ్వ.


Click it and Unblock the Notifications











