శరత్ బాబు మూడో పెళ్లి చేసుకొన్నాడా? తలకొరివి పెట్టేదెవరు? అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడ?
విలక్షణ నటుడు శరత్ బాబు ఇకలేరనే వార్త సినీ అభిమానులను, దక్షిణాది సినీ రంగాన్ని విషాదంలోకి నెట్టింది. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో మరణించారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయనకు తలకొరివి పెట్టేదెవరు? ఆయన అంత్యక్రియలు ఎప్పుడు అనే ప్రశ్నలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రమాప్రభ, స్నేహాతో వివాహం: శరత్ బాబు ఆర్థికంగా కొన్ని కష్టాలను ఆరంభంలో ఎదుర్కొన్నారు. అప్పటికే సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా వెలుగొందుతున్న రమాప్రభ, శరత్ బాబు ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్నారు. దాంతో వారిద్దరూ చెన్నైలో స్థిరపడ్డారు. దాదాపు 14 ఏళ్లు దాంపత్య జీవితం తర్వాత వ్యక్తిగత విభేదాలతో విడిపోయారు. అనంతరం నంబియార్ కూతురు స్నేహ అనే యువతిని వివాహం చేసుకొన్నారు. అయితే స్నేహతో వైవాహిక జీవితం ఎక్కువ రోజులు కొనసాగలేదు.2011లో స్నేహా నుంచి విడాకులు తీసుకొన్నారు అని శరత్ బాబు స్నేహితుడు నాగేశ్వరరావు తెలిపారు.

సంతానం లేకుండానే ఒంటరిగా: రమాప్రభ, స్నేహాతో విడాకులు తర్వాత మూడో పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాను. కానీ ఆయన వివాహం చేసుకోలేదు. ఆయనకు ఇద్దరితోను సంతానం కలుగలేదు. పిల్లలు లేకుండా జీవితాన్ని గడిపారు. శరత్ బాబు కుటుంబ చాలా పెద్దది. ఏడుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కాచెల్లెలు ఉన్నారు. వారి పిల్లలే 25 మంది వరకు ఉంటారు అని నాగేశ్వరరావు చెప్పారు.
చెన్నైలో అంత్యక్రియలు: శరత్ బాబు అంత్యక్రియలు చెన్నైలో కుటుంబ సభ్యుల మధ్య జరుగున్నాయి. తమ కుటుంబంలోని పిల్లల్లో ఒకరు ఆయనకు తలకొరివి పెట్టనున్నారు. ఇప్పటికే ఆముదాలవలస, ఇతర ప్రాంతాల నుంచి బంధువులు, కుటుంబ సభ్యులు చెన్నైకి చేరుకొన్నారు. మంగళవారం మధ్యాహ్నం శరత్ బాబు అంత్యక్రియలు జరుగుతాయి అని స్నేహితులు, బంధువులు తెలిపారు.

అభిమానుల కోసం శరత్ బాబు భౌతికకాయం: సోమవారం (మే 22వ తేదీన) తుదిశ్వాస విడిచిన శరత్ బాబు పార్థీవ దేహాన్ని సాయంత్రం 5.30 గంటల సమయంలో హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు, సహనటుల సందర్శనార్థం ఉంచారు. 7.30 గంటల తర్వాత ఆయన భౌతిక కాయాన్ని చెన్నైకి తరలించారు.

శరత్ బాబు సినీ కెరీర్ ఇదే..: శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. 1973లో రామరాజ్యం అనే చిత్రంతో ఆయన సినీ కెరీర్ ప్రారంభించారు. తెలుగు, తమిళం,మలయాళ, కన్నడ, హిందీలో 300కుపైగా చిత్రాల్లో నటించారు. 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు నంది అవార్డు అందుకొన్నారు. సీతాకోకచిలుక, సాగర సంగమం, అభినందన, సితార, అన్వేషణ, సంసారం ఒక చదరంగం, ఆపద్బాందవుడు, ముత్తు, హలో బ్రదర్,స్వాతి ముత్యం, దాగుడు మూతలు, సిసిందీ లాంటి చిత్రాలు ఆయన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చాయి.


Click it and Unblock the Notifications











