Sarileru Neekevvaru Pre Release Event : చిరంజీవి, మహేష్‌ల భారీ కటౌట్లు.. సరిలేరు ఈవెంట్‌లో ఫ్యాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి. అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది. మరి ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ ఓ సారి చూద్దాం..

రామ జోగయ్య శాస్త్రి
''మీ అందరినీ చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. మెగా సూపర్ ఈవెంట్ చాలా చల్లగా చక్కగా సాగుతోంది. సరిలేరు నీకెవ్వరు ఈ టైటిల్ పెట్టినప్పటి నుంచి బజ్ నెలకొంది. నాకు సరిలేరు నీకెవ్వరు పూర్తి కథ ఓ హోటల్‌లో కలిసినప్పుడు అనిల్ రావిపూడి చెప్పాడు. విజయశాంతిని మళ్ళీ తెరపైకి తీసుకురావడం గ్రేట్. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ లాంటి ఎందరో గ్రేట్ నటీనటులతో మంచి కథ, కామెడీ టైమింగ్‌తో ఈ సినిమా రూపొందించారు. ఇందులో నేను రెండు పాటలు రాశాను. మహేష్ ఫ్యాన్స్‌కి, ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి ఈ మంచి పాటలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ సినిమా నాకు అవకాశమిచ్చింది. జనవరి 11 కోసం మీ అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను'' అని రామ జోగయ్య శాస్త్రి అన్నారు.

ఇక ఎంటర్టైన్ చేస్తూ.. సినిమాలు తీస్తూ ఉంటా : బండ్ల గణేష్
ఈ వేడుకలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. అనిల్ రావిపూడిని కలిశాక నా పాత్ర గురించి చెప్పాడు. మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసే పాత్ర అది. ముప్పై ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను.. మేనేజర్‌గా, నటుడిగా, ఓ స్టార్ హీరోవల్ల నిర్మాతగానూ అయ్యాను. మధ్యలో ఓ చిన్న తప్పు చేశాను. సుమ గారు చెప్పినట్టు 7 ఓ క్లాక్ బ్లేడ్.. అది వేస్ట్.. ఇది బెస్ట్ అని.. అందరితో యెర్రి డ్యాష్ అనిపించుకుని ఇక్కడికి వచ్చా. అనిల్ రావిపూడికి, దిల్ రాజుగారికి బ్లాక్ బస్టర్ అవుతుంది. మహేష్ కెరీర్‌లోనే కాదు. ఇండస్ట్రీలోనే నంబర్ వన్ అవుతుంది. మిమ్మల్ని అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ.. సినిమాలు తీస్తూ.. సినిమానే జీవితంగా బతకాల'ని అనుకుంటున్నానని తెలిపాడు.

చిరంజీవి, మహేష్ బాబు పాటలకు డాన్సులు.. ఎంజాయ్ చేస్తున్న జనం
కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సరిలేరు నీకెవ్వరు ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు పాటలు హోరెత్తిపోతున్నాయి. చిరంజీవి, మహేష్ బాబు పాటలకు డాన్సర్లు చేస్తున్న డాన్సులు చూసి ఎంజాయ్ చేస్తున్నారు జనం. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోని డైలాగులు కూడా ప్లే చేస్తూ జనాల్లో హుషారు నింపుతున్నారు. యాంకర్ సుమ స్టేజీపైకి వచ్చేసి మాట్లాగారడి ప్రారంభించింది. సుమ మొత్తానికి అక్కడి వాతావరణం చూస్తుంటే చిరంజీవి రాగానే ఆ ఉత్సాహం, అరుపులు ఊహలకు అందేలా లేవని తెలుస్తోంది.

మహేష్ పాటలతో సింగర్ సింహా సందడి
సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దేవీ శ్రీ ప్రసాద్ కూడా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వబోతోన్నట్లు తెలుస్తోంది. సరిలేరు టైటిల్ సాంగ్‌ను దేవీ లైవ్‌గా పాడబోతోన్నట్లు తెలిపాడు. దీనికి సంబంధించిన రిహార్సల్స్ కూడా చేసేస్తున్నాడు. ప్రస్తుతం సింగర్ సింహా.. చిరు, మహేష్ సినిమాల్లోని పాటలతో అభిమానులను అలరిస్తున్నాడు. మహేష్ హిట్ చిత్రాల్లోని మాస్ పాటలను తన టీమ్‌తో కలిసిపాడి ఫ్యాన్స్‌లో జోష్ నింపేస్తున్నాడు. బిజినెస్‌మెన్, ఆగడు, శ్రీమంతుడు లాంటి చిత్రాల్లోని పాటలను పాడి ఎల్బీ స్టేడియంలో సందడి నింపాడు.

భారీ కటౌట్లు, ట్రాఫిక్ ఆంక్షలు..
ఎల్బీ స్టేడియం లోపల, ఆ ప్రాంగణం చుట్టూ మెగాస్టార్, సూపర్ స్టార్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. అయితే అభిమానుల తాకిడి కూడా ఎక్కువయ్యే అవకాశముందనుకున్న పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. ఆ రూట్‌లకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. నేటి ఉదయం నుంచే అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో అక్కడి ప్రాంగణమంతా సందడిగా మారింది.


Click it and Unblock the Notifications











