‘పద్మావత్’ వివాదం: బీజేపీ పాలిత రాష్ట్రాలకు సుప్రీం కోర్టు షాక్!
Recommended Video

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'పద్మావతి' చిత్రంపై కొన్ని రోజులుగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ వివాదాలన్నీ దాటుకుని, సెన్సార్ అడ్డంకులు తొలగించుకుని.... 'పద్మావత్' గా పేరు మార్చుకుని జనవరి 25న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని..... రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అడ్డుకోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది.

‘పద్మావత్' అడ్డుకోవడానికి వీల్లేదు
శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని, ఆ కారణంతో ‘పద్మావత్' సినిమా విడుదలను అడ్డుకోవడం తగదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

నిర్మాతలకు అనుకూలంగా తీర్పు
ఆయా రాష్ట్రాల్లో నిషేదం నేపథ్యంలో ‘పద్మావత్' నిర్మాతలు సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో సుప్రీం గురువారం తీర్పునిస్తూ ఐదు రాష్ట్రాల్లో సినిమాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశించింది.

దేశ వ్యాప్తంగా విడుదలవుతున్న పద్మావత్
సుప్రీం కోర్టు తీర్పుతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం ఎంతో మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.

మొదటి నుండి అడ్డంకులే
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదట్నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. రాజ్‌పుత్ రాణుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా సినిమా ఉండబోతోందని కర్నిసేన, కొన్ని హిందూ సంఘాలు ఈ చిత్రంపై ఆందోళన చేయడంతో సెన్సార్ బోర్డు చరిత్ర కారుల సమక్షంలో ఈ చిత్రాన్ని సెన్సార్ చేసి సర్టిఫికెట్ జారీ చేసింది.

రూ. 200 కోట్ల బడ్జెట్
దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ‘పద్మావత్' చిత్రాన్ని నిర్మించారు. దీపిక పదుకోన్ ఈ సినిమాలో రాణి పద్మావతి పాత్రలో నటించారు. పద్మావతి భర్త మహారావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించారు.


Click it and Unblock the Notifications











