సెకండ్ హాండ్ వేదికపై ‘సీతమ్మ వాకిట్లో...’ ఆడియో
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఆడియో డిసెంబర్ 15న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో ఈ వేడుక జరుగనుంది.
మహేష్ బాబు, వెంకటేష్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు... కొన్ని ఖర్చుల విషయంలో మాత్రం కక్కుర్తి పడుతున్నాడనే వాదన వినిపిస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో వేడుక కోసం సెకండ్ హ్యాండ్ వేదికను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడట.
హీరో రాణా సోదరి మాళమిక వివాహం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో జరుగనున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుక కోసం భారీ ఖర్చుతో అందమైన వేదిక రెడీ అయింది. భారీ సంఖ్యలో అతిథులు హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు గ్రాండ్ గా చేసారు. ఈ పెళ్లి వేడుక కోసం వేసిన వేదికనే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో వేడుక కోసం ఉపయోగించనున్నారట. ఖర్చు తక్కువ చేసుకోవడానికే దిల్ రాజు ఈ నిర్ణయానికి వచ్చారట. మహేష్ బాబు, వెంకటేష్ లాంటి పెద్ద హీరోల సినిమాల విషయంలో కూడా నిర్మాత ఇలా వ్యవహరించడంపై అభిమానుల్లో అసహనం వ్యక్తం అవుతోంది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











