‘SVSC’ ఆడియో రామానాయుడు స్టూడియోలో!
హైదరాబాద్ : మహేష్ బాబు-వెంకటేష్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో ఫంక్షన్ కు సంబంధించి ఓ ఆసక్తికర అంశం ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తోంది. ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ నానక్రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వాస్తవానికి ఈచిత్రం ఆడియో డిసెంబర్ 13న వెంకీ పుట్టిన రోజును పురస్కరించుకుని విడుదల చేద్దామని అనుకున్నారు. అయితే అనుకోని కారణాలతో డిసెంబర్ 15కు వాయిదా వేసారు. సినిమాను సక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇద్దరు పెద్ద స్టార్లు కావడంతో భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











