‘SVSC’ ఆడియో మళ్లీ వాయిదా- కారణం ఏంటి?
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఆడియో మళ్లీ వాయిదా పడింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇటీవల నిర్ణయించిన డిసెంబర్ 15న కాకుండా, మరో రోజు ఆలస్యంగా అంటే డిసెంబర్ 16న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తొలుత ఈచిత్రం ఆడియోను వెంకటేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని డిసెంబర్ 13న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ.... డిసెంబర్ 15కు వాయిదా వేసారు. తాజాగా డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేసారు. ఆడియో వాయిదా పడటంపై ఆరా తీయగా... ఆరోజు వెంకటేష్ ఔటాఫ్ స్టేషన్లో ఉండటం వల్లనే ఆడియో రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఇక సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇద్దరు పెద్ద స్టార్లు కావడంతో భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











