twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సీతమ్మ వాకిట్లో...’ ఆడియో ఆవిష్కరణ విశేషాలు (ఫొటోలతో...)

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్‌బాబుతో కలిసి వెంకటేష్ నటించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. సమంత హీరోయిన్. అంజలి, ప్రకాష్‌రాజ్‌, జయసుధ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చారు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి.

    తొలి సీడీని వెంకటేష్‌ కుమారుడు అర్జున్‌ ఆవిష్కరించి మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌ కృష్ణకి అందజేశారు. పాటల ఆవిష్కరణ హైదరాబాదులోని నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోలో అత్యంత వైభవంగా జరిగింది. ఇక ఈ అందమైన వేడుక ఏర్పాట్లు, ఇతర విశేషాల్లోకి వెళితే...

    తాటాకు ఇళ్లు, ఇంటి ముందు రంగవల్లులు, సంక్రాంతి హరిదాసులు, కోలాటం... వంటి తెలుగు పల్లె అందాలను ఆవిష్కరిస్తూ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా అందమైన 'సీతమ్మ వాకిలి' సెట్.. ఆ సెట్లో అమర్చిన సిరిమల్లె చెట్టు వెరసి కళ్ళ ముందు నిలిపి ఆ వేదికను చూడముచ్చటగా చేసారు. వేద మంత్రాలతో ఈ వేడుక సంప్రదాయబద్ధంగా ఆరంభమైంది.

    ‘సీతమ్మ వాకిట్లో...’ ఆడియో ఆవిష్కరణ విశేషాలు (ఫొటోలుతో...)

    వెంకటేష్ కుమారుడు అర్జున్, మహేష్‌బాబుముద్దుల కుమారుడు గౌతమ్ ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అర్జున్ ఆడియో సీడీని ఆవిష్కరించి గౌతమ్‌కి ఇచ్చారు. ఇది మల్టీస్టారర్ చిత్రం కావడంవల్ల ‘మల్టీ యాంకర్స్' తరహాలో ఝాన్సీ, సుమ ఈ వేడుకను తమదైన శైలిలో అందంగా నిర్వహించారు.

     ‘సీతమ్మ వాకిట్లో...’ ఆడియో ఆవిష్కరణ విశేషాలు (ఫొటోలుతో...)

    మహేష్‌బాబు మాట్లాడుతూ.... ''కొత్త కొత్త అనుభూతుల్ని కలిగించిన చిత్రమిది. వెంకటేష్‌తో పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. కృషి, అంకితభావం కలిగిన నటుడాయన. నేను ఆయన్నుంచి చాలా నేర్చుకొన్నాను. శ్రీకాంత్‌ పదిహేను నిమిషాలు ఈ కథ చెప్పాడు. వినగానే చాలా బాగా నచ్చింది. అతను గోదావరి యాసలో మాట్లాడతాడు. నేను ఆయన్నే అనుసరించి సంభాషణలు చెప్పాను. ఈ సినిమా కోసం శ్రీకాంత్‌ మూడేళ్లు కష్టపడ్డాడు. దానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది.అవుట్‌స్టాండింగ్ ఆడియో ఇచ్చాడు మిక్కీ. బహుశా ఇది అతని కెరీర్‌లో బెస్ట్ ఆల్బమ్ అయ్యుండొచ్చు. క్లారిటీ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఆయన బేనర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. అన్నీ కలిసొస్తే ఇంకా ఈ బేనర్‌లో చేయాలని ఉంది. ఈసారి సంక్రాంతి మూడు రోజుల ముందే రాబోతోంది. అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకొందాం. '' అన్నారు.

     ‘సీతమ్మ వాకిట్లో...’ ఆడియో ఆవిష్కరణ విశేషాలు (ఫొటోలుతో...)

    వెంకటేష్ మాట్లాడుతూ..''ఒక నటుడిగా నాకు తీపి జ్ఞాపకాలెన్నింటినో పంచిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. సెట్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే మహేష్‌బాబు నాకు తమ్ముడైపోయాడు. చక్కటి కుటుంబ కథ ఇది. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతి కలిగిస్తుందనే నమ్మకంతోనే తీశాం. మహేష్‌, నేను ఒకరికొకరం దగ్గరయ్యాం. మిక్కీ మంచి సంగీతం అందించాడు. ఇద్దరు కథానాయకులు కలిసి సినిమా చేస్తే అంచనాలు పెరిగిపోతాయని తెలుసు. ఆ అంచనాలు పక్కనపెట్టి రండి. తప్పకుండా సినిమాని ఆస్వాదిస్తారు'' అన్నారు.

     ‘సీతమ్మ వాకిట్లో...’ ఆడియో ఆవిష్కరణ విశేషాలు (ఫొటోలుతో...)

    దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ... ''ఇద్దరు హీరోలతో సినిమా ఎలా తీశావని అడుగుతున్నారు. కథలోనే కాదు, కలలోనూ వారు వేరు వేరు కాదు. ఒక ఆత్మకు రెండు రూపాలు. ఈ సినిమాలో ఒక సామాన్యుడిని హీరోని చేశాం. అందుకు మహేష్‌, వెంకటేష్‌ ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను. నా జీవితంలో నాకెదురైన కొన్ని అనుభవాలతో తెరకెక్కిన చిత్రమిది. మా అన్నయ్య అచ్చం వెంకటేషే. నేను మాత్రం మహేష్‌బాబుని కాదు (నవ్వుతూ). ఈ సినిమాకి నేను దర్శకుడ్ని కావడం నా పూర్వజన్మ సుకృతం. నిరాడంబరంగా, ఆనందంగా ఉండడమెలాగో చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది'' అన్నారు.

     ‘సీతమ్మ వాకిట్లో...’ ఆడియో ఆవిష్కరణ విశేషాలు (ఫొటోలుతో...)

    నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ''మా సంస్థ సినిమాలు తీయడం ప్రారంభించి పది సంవత్సరాలైంది. పదోయేట ఒక మల్టీస్టారర్‌ సినిమా తీయడం నా అదృష్టం. శ్రీకాంత్‌ ఇద్దరు హీరోలు కావాలి అన్నప్పుడు కుదరదని చెప్పాను. కానీ చాలా పట్టుబట్టాడు. వెంకటేష్‌ ముందే ఈ కథను ఒప్పుకొన్నారు. 'దూకుడు' సెట్‌లో మహేష్‌బాబుకి కథ చెప్పాం. వీళ్లిద్దరూ సినిమాలో నిజమైన అన్నదమ్ముల్లా ప్రవర్తించారు. సినిమాపై ప్రేమతో నటించారు. కలిసుందాం రా, మురారి కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది,. మిక్కీ జె మేయర్‌ని సంగీతదర్శకుడిగా తీసుకుందామని శ్రీకాంత్ అంటే... ఇంత పెద్ద హీరోలకు సాఫ్ట్ మ్యూజిక్ ఇచ్చే అతనా? వద్దన్నాను. కానీ మిక్కీ టైటిల్ సాంగ్ వినిపించగానే 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను. 20ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ తీస్తాను. అది కూడా గౌతమ్, అర్జున్‌తో...''అన్నారు.

    ‘సీతమ్మ వాకిట్లో...’ ఆడియో ఆవిష్కరణ విశేషాలు (ఫొటోలుతో...)

    హీరోయిన్ సమంత మాట్లాడుతూ... ''చాలా పెద్ద సినిమా ఇది. ఇద్దరు సూపర్‌స్టార్‌లతో కలిసి నటించడం నా అదృష్టం. మళ్లీ ఇలాంటి అవకాశం నాకు దొరకదు. ప్రతి ఫ్రేమ్‌లోనూ తెలుగుదనం, సంస్కృతి కనిపిస్తుంది'' అన్నారు.

     ‘సీతమ్మ వాకిట్లో...’ ఆడియో ఆవిష్కరణ విశేషాలు (ఫొటోలుతో...)

    ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ... '' 20ఏళ్ల నా నటజీవితంలో నేనెక్కువగా మాట్లాడాల్సిన సినిమా ఇది. ఇందులో ఓ డైలాగ్ ఉంది. మంచివాడు అనిపించుకుంటే మనిషవుతాడని. శ్రీకాంత్ ఈ కథ చెప్పినప్పుడు మంచివాడ్ని అనిపించుకోవాలనిపించింది. ఈ సినిమా చేసిన తర్వాత నాలోని కొన్ని చెడు గుణాలు దహనం అయ్యాయి. అనూహ్యమైన సబ్జెక్ట్ ఇది. దీన్ని సినిమా అని పిలవడం నాకిష్టం లేదు. ఇది జీవితం. మనలో ఉన్న మంచితనాన్ని హత్తుకునే సినిమా ఇది. రిలీజయ్యాక ఈ సినిమాని నేను చూడనని, ఈ సినిమా చూస్తున్న జనాలను చూస్తానని శ్రీకాంత్ అడ్డాలకు చెప్పాను'' అన్నారు.

    ‘సీతమ్మ వాకిట్లో...’ ఆడియో ఆవిష్కరణ విశేషాలు (ఫొటోలుతో...)

    ప్రముఖ నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ... ''చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరు హీరోలు కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఇది పరిశ్రమకు చాలా మంచిది. కృష్ణ, శోభన్‌బాబు గతంలో మండే గుండెలు, ముందడుగు, కృష్ణార్జునులు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత స్టార్ హీరోలెవరూ మల్టీస్టారర్ చిత్రాలు చేయలేదు. ఇప్పుడీ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన వెంకటేష్, మహేష్‌లను అభినందిస్తున్నాను. సినిమా మార్కెటింగ్‌కి ఈ విధానం మంచిది. నిర్మాత కూడా దీనివలన లాభాలు చవిచూడొచ్చు. ఇతర హీరోలు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయాలి.'' అన్నారు.

    ‘సీతమ్మ వాకిట్లో...’ ఆడియో ఆవిష్కరణ విశేషాలు (ఫొటోలుతో...)

    అంజలి మాట్లాడుతూ ''ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సీత పాత్రలో కనిపిస్తాను'' అన్నారు.

    ‘సీతమ్మ వాకిట్లో...’ ఆడియో ఆవిష్కరణ విశేషాలు (ఫొటోలుతో...)

    ఈ కార్యక్రమానికి శ్రీనువైట్ల, వంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను, శిరీష్‌, లక్ష్మణ్‌, గుహన్‌, వాసు వర్మ, నమ్రత శిరోద్కర్‌, అనంతశ్రీరామ్‌ తదితరులు హాజరయ్యారు.

    English summary
    Seethamma Vaakitlo Sirimalle Chettu film's music was launched in grand and unique style. producer Dil Raju brought in superstars' sons to the audio launch and made them to unveil the audio albums. Venkatesh came with his son Arjun while Mahesh Babu was present with his wife Namarata and son Gautham. The audio albums were unveiled by Arjun and Gautham while both the stars helped them on the stage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X