‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ విడుదల వాయిదా
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం విడుదల వాయిదా పడింది. ఇది వరకు ఈ చిత్రం విడుదల తేదీని డిసెంబర్ 21న ఖరారు చేసినప్పటికీ తాజాగా సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.
సంక్రాంతి సీజన్లో అయితే సినిమా కలెక్షన్లు బాగా వస్తాయనే ఉద్దేశ్యంతో విడుదల వాయిదా వేసినట్లు ఇండస్ట్రీ టాక్. సినిమా వాయిదాపై త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











