‘సీతమ్మ వాకిట్లో...’పై దిల్ రాజు మాట తప్పుతాడా?
హైదరాబాద్: వెంకటేష్, మహేష్ బాబు మల్టీ స్టారర్ గా రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ముందుగా అనుకున్నట్లు డిసెంబర్ 21న కాకుండా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు వార్తలు రావడం.... అలాంటిదేమీ లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను డిసెంబర్ 21నే విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అయితే... తాజా పరిస్థితి చూస్తుంటే దిల్ రాజు మాటతప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కావడం లేదని..... జనవరి 11, 2013న విడుదల చేస్తారని తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ వేసిన భద్రాద్రి సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్ పుట్టినరోజైన డిసెంబర్ 13ను పురస్కరించుకుని ఈ చిత్రం ఆడియో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











