రైల్వే ట్రాక్ పక్కన ప్రముఖ నటుడి డెడ్‌బాడీ..మురళీ మోహన్ ను వెంటాడిన రెండు విషాద సంఘటనలు
రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వించడానికి, ఏడిపించడానికి, ఆనందంలో ముంచెత్తడానికి నటీనటులు, దర్శకులు , సాంకేతిక నిపుణులు ఎంతో శ్రమిస్తారు. సినిమా బాగుందని ప్రేక్షకులు ఆనందంతో థియేటర్ నుంచి బయటకొస్తే చాలు ఆ శ్రమను మొత్తం మరిచిపోతారు సినీ జనాలు. కానీ చిత్రీకరణ అనుకున్నంత ఆషామాషీ కాదు.. షూటింగ్ స్పాట్‌లో జరిగిన ప్రమాదాల్లో ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రాణాలు కోల్పోవడమో, అంగవైకల్యం పొందడమో జరిగింది.
మలయాళ నటుడు జయన్ ఓ హెలికాఫ్టర్ షాట్‌లో మరణించారు.. తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్, నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ ఓ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో తన రెండు కాళ్లు పొగొట్టుకుని జీవితాంతం వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. ఇవాళ కూడా కార్తీ నటిస్తున్న సర్దార్ -2 షూటింగ్ స్పాట్‌లో జరిగిన ప్రమాదంలో ఏలుమలై అనే స్టంట్ మ్యాన్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా నిత్యం సెట్‌లో చిన్న చిన్న ప్రమాదాలు సరే సరి. ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా తిరిగి కోలుకుని సినిమా షూటింగ్‌ల్లో పాల్గొన్నవారెందరో. అప్పటి వరకు తమతో పాటు తిరిగిన మిత్రులు తిరిగిరాని లోకాలకు తరలిపోవడం, సెట్‌లో జరిగే ప్రమాదాలతో మనస్తాపానికి గురైనా గుండెరాయి చేసుకుని ముఖానికి రంగేసుకునే నటీనటులకు సెల్యూట్.

ఈ క్రమంలోనే దిగ్గజ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలో జరిగిన రెండు విషాదకరమైన ఘటనలను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో బంగారక్క సినిమాలో తాను హీరో, శ్రీదేవి హీరోయిన్ అని అయితే అప్పటికీ చిన్నతనం కావడంతో ఇంకా మెచ్యూరిటీ రాలేదని షూటింగ్ స్పాట్‌లో సినిమాలో నటించే తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండేదని మురళీ మోహన్ తెలిపారు.
ఒకరోజు ఔట్‌డోర్ షూటింగ్‌కు పిల్లలతో పాటు ఒక పాప వచ్చిందని.. మా క్యాస్టింగ్ లెక్కలో ఆ పాప లేదని , సాయంత్రం కొందరు వచ్చి మా అమ్మాయి కనిపించడం లేదని ప్రొడక్షన్ వాళ్లతో చెప్పారని వెల్లడించారు. మీ అమ్మాయి మా సినిమాలో లేదని చెబితే.. ఇంకోపాపతో ఫ్రెండ్ షిప్ ఉండటంతో ఆ అమ్మాయితో పాటు వచ్చిందని తల్లిదండ్రులు వాదనకు దిగారని మురళీమోహన్ తెలిపారు. ఆరా తీస్తే చెరువులో జరిగిన సీన్ తర్వాత ఆ పాప కనిపించలేదని తేలడంతో.. అందరం కలిసి చెరువు మొత్తం గాలిస్తే బురదలో పాప మృతదేహం కనిపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరో ఘటనలో అద్దాల మేడ సినిమాను మద్రాస్ నగరానికి చాలా దూరంగా షూట్ చేస్తున్నామని, కేవీ చలం కూడా అందులో నటిస్తున్నారని.. మాతో పాటే ఆయన రెగ్యులర్‌గా షూటింగ్‌లో పాల్గొనేవాడని మురళీ మోహన్ తెలిపారు. ఓ రోజున చలం రాలేదని.. వేరే షూటింగ్ ఉందని కూడా చెప్పలేదని , దాసరికి అనుమానమొచ్చి మిగిలిన లొకేషన్‌లలో అడిగి చూశామని, ఇంటికి ఫోన్ చేస్తే రాత్రి షూటింగ్‌కే బయల్దేరారని చెప్పారని ఆయన వెల్లడించారు. రాత్రి చలం గురించే అందరం కూర్చొని మాట్లాడుకున్నామని.. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి రైల్వే ట్రాక్ పక్కన ఓ డెడ్ బాడీ కనిపించిందని .. చూస్తే గూర్ఖాలాగా ఉన్నాడని చెప్పాడని మురళీ మోహన్ తెలిపారు.
దీంతో తాము చలం ఇంటికి ఫోన్ చేసి రాత్రి ఏ బట్టలు వేసుకున్నాడని అడిగితే ఖాకీ బట్టలు, సఫారీ వేసుకుని బయల్దేరారని చెప్పడంతో అనుమానం వచ్చిందన్నారు. బాడీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఓ హాస్పిటల్‌లో పెట్టారని.. అప్పుడు రాత్రివేళ తాను, మోహన్ బాబు ఇద్దరం కలిసి ఆసుపత్రి వాళ్లని మేనేజ్ చేసి డెడ్ బాడీ చూస్తే చలానిదేనని మురళీ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మర్నాడు దాసరి నారాయణ రావు పూనుకుని ఆర్టిస్టులందరినీ తీసుకుని ఘనంగా అంత్యక్రియలు చేశామని ఆయన గుర్తుచేసుకున్నారు.


Click it and Unblock the Notifications











