త్వరలోనే సినిమా డైరక్షన్ చేస్తా: కృష్ణంరాజు
ఇప్పటివరకూ హీరోగా 150కు పైగా సినిమాలు చేశాను. నిర్మాతగా ఎన్నో విలువైన చిత్రాలు నిర్మించాను. కేంద్రమంత్రిగా పదిహేను నెలలు సేవలందించాను. ఈ మూడు విభాగాల్లోనూ నా పాత్రను సంతృప్తికరంగా పోషించాను. ఇక మిగిలింది దర్శకత్వం. త్వరలో ఆ పని కూడా పూర్తి చేస్తాను. అప్పట్లో నేను చేసిన 'కృష్ణవేణి' తరహాలోనే స్త్రీ ప్రాధాన్య కథాంశంతో నేను దర్శకత్వం చేయబోయే సినిమా ఉంటుంది. కథ నేనే సిద్ధం చేసుకున్నాను అంటున్నారు డా.కృష్ణం రాజు. ఆయన పుట్టినరోజు..బుధవారం(ఈరోజు). ఆ సందర్భంగా ఆయన మీడియాను కలిసి తన మనస్సులో మాట అయిన దర్శకత్వం చేయాలన్న కోరికను బయిటపెట్టారు. ఆయన మాటల్లోనే...చాలా విరామం తర్వాత గోపీకృష్ణ మూవీస్ సంస్థలో తీసిన 'బిల్లా' చిత్రం తనకు ఆర్ధికంగానూ, హార్ధికంగా సంతృప్తిని మిగిల్చిందని చెప్పారు.
ఇకపై కూడా ఇదే రీతిలో తమ సంస్థ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే విధంగా మంచి చిత్రాలు నిర్మిస్తాను అన్నారు. అలాగే ఆదివారాలు కూడా విశ్రాంతి తీసుకోకుండా రాత్రింబవళ్లు పని చేస్తూ ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసేవాణ్ని. కొన్ని నా ఇమేజ్‌ను పెంచుకోవడం కోసం చేస్తే, మరికొన్ని పరిశ్రమ బాగు కోసం చేశాను. మనం ఒక సినిమా చేస్తే కొన్ని వందల కుటుంబాలకు పని దొరుకుతుంది. నేను చేసిన సినిమా టీవీలో చూస్తుంటే చాలా ఆనందం కలుగుతోంది. ఇన్ని గొప్ప సినిమాలు చేశానా...అని మనసు పులకించి పోతోంది. ఇప్పట్లోలాగా కథల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసింది లేదు. సినిమా చేయడానికి నెల రోజుల ముందు కథ వినేవాణ్ని అంతే. ఒకే ఒక్క సినిమా మాత్రం కథ వినకుండా ఆ దర్శకుడి మీద నమ్మకంతో చేశాను. అదే 'కటకటాల రుద్రయ్య'..అంటూ చెప్పుకొచ్చారు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన దర్శకత్వం చేయబోయే చిత్రం కూడా హిట్టు కావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











