ప్రకాష్ రాజ్‌కు తగిన శాస్తి అని వారు, మద్దతుగా వీరు!
హైదరాబాద్: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు 'ఆగడు' సినిమాకు సంబంధించిన వివాదం అతనిపై వేటు ఖాయమనే పరిస్థితులకు దారి తీస్తోంది. ముఖ్యంగా దర్శకుల సంఘం ఎట్టి పరిస్థితుల్లోనూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని పట్టుదలతో ఉంది. అదే సమయంలో ఆయనకు పరిశ్రమలో కొందరి మద్దతు కూడా ఉంది.
ఇప్పటి వరకు ప్రకాష్ మూలంగా షూటింగుల సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఫిల్మ్ మేకర్స్ అతనికి తగిన శాస్తి చేయాల్సిందే అనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి శిక్షిస్తేనే అతను దారికొస్తాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ శిక్ష ఖరారైతే అతనిపై కొంతకాలం పాటు తెలుగు సినిమాల్లో నిషేదం కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా....తనపై నిషేదం పడకుండా ప్రకాష్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకు సన్నిహితులైన కొందరు నిర్మాతలు, దర్శకులతో లాబీయింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో దిల్ రాజు, పూరి జగన్నాథ్, కృష్ణ వంశీ, వివి వినాయక్ లాంటి వారు ప్రకాష్ రాజ్‌కు సన్నిహితులు. ప్రకాష్ రాజ్‌ను గట్టెక్కించేందుకు వీరు తమ వంతుప్రయత్నం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు వివాదం విషయానికొస్తే...... షూటింగులకు ఆలస్యంగా హాజరు కావడం, అసిస్టెంట్ డైరెక్టర్లను తిట్టడం లాంటి చర్యల పాల్పడుతున్న ప్రకాష్ రాజ్‌ను సినిమా నుండి తప్పించారు. అతని స్థానంలో సోనూ సూద్‌ను తీసుకున్నారు. దర్శకత్వ విభాగానికి చెందిన వారిపై అసభ్యంగా ప్రవర్తించిన ప్రకాష్ రాజ్‌పై 'ఆగడు' చిత్ర కో డైరెక్టర్ ఒకరు దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేసారు. ప్రకాష్ రాజ్‌పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని దర్శకుల సంఘం నిర్ణయించింది. త్వరలోనే వేటు వేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











