చెత్త సినిమా: జయకు షారుక్ ఖాన్ రిప్లై ఇలా...
ముంబై: షారుక్ ఖాన్, దీపిక పుదుకోన్, అభిషేక్ బచ్చన్, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో ఫరా ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ ఘనత సాధించడంపై అమితాబ్ బచ్చన్ ఆనందం వ్యక్తం చేస్తే.....ఇదో చెత్త సినిమా అంటూ ఆయన భార్య జయా బచ్చన్ బహిరంగ కామెంట్స్ చేసారు. తన కొడుకు నటించిన సినిమాపై జయ విమర్శలు చేయడం మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఇలాంటి వాటిల్లో నటించాల్సి వస్తుందనే భయంతోనే సినిమాలకు దూరంగా ఉంటున్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఓ సంచలన అయ్యాయి. అయితే జయా బచ్చన్ విమర్శలకు షారుక్ ఖాన్ తనదైన రీతిలో రిప్లై ఇచ్చారని తెలుస్తోంది. ‘మీ భర్త అమితాబ్ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాన్ని కూడా అప్పట్లో కొంతమంది పనికిమాలిన అంటూ విమర్శలు వచ్చాయి. కానీ ఇపుడు ఆ చిత్రాన్ని క్లాసిక్ అంటున్నారు' అంటూ షారుక్ ఖాన్ జయాబచ్చన్ తో అన్నట్లు బాలీవుడ్ టాక్.

బాలీవుడ్లో షారుక్ ఖాన్‌కు బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయనకు అసలే కోపం ఎక్కువ. భార్య వ్యాఖ్యల వల్ల షారుక్ ఫ్యామిలీతో సంబంధాలు చెడిపోకుండా ఉండేందుకు అమితాబ్ నివారణ చర్యలు చేపట్టారు. తన భార్య తరుపున తాను సారీ చెప్పారట. మరో వైపు అభిషేక్, ఐశ్వర్యరాయ్ కూడా షారుక్‌ను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా ఆయన్ను కలిసినట్లు సమాచారం.
మొత్తానికి..... జయ బచ్చన్ వ్యాఖ్యలు ఇటు మీడియాలో హాట్ టాపిక్ అవడంతో పాటు, అటు ఆమె కుటుంబ సభ్యులు ఇబ్బంది పడేలా చేసింది. జయా బచ్చన్‌ది ముందు నుండి ముక్కుసూటి తనమే, ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదని అంటున్నారు బాలీవుడ్ జనాలు.


Click it and Unblock the Notifications











