మోడీ పీఎం అయితే దేశం విడుస్తా: చిక్కులో షారుక్..ఖండన
హైదరాబాద్: ఎవరో చేసిన పనికి బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నరేంద్ర మోడీ ప్రధాని అయితే తాను దేశం విడిచి వెళ్లి పోతాను అంటూ షారుక్ ట్విట్టర్లో పేర్కొన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, తాను అలాంటి ట్వీట్స్ ఏమీ చేయలేదని షారుక్ అంటున్నారు.
తాను నరేంద్ర మెడీకి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదని షారుక్ ఖాన్ స్పష్టం చేసారు. తనపై కావాలనే కొందరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని షారుక్ ఖాన్ తేల్చి చెప్పారు. ఈ తప్పుడు వార్తను నమ్మే వారంతా ఫూల్సే అని షారుక్ ఖాన్ స్పష్టం చేసారు.

ఈ వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయి??
'కమల్ ఆర్ ఖాన్(కెఆర్‌కె) అనే బాలీవుడ్ నటుడు మోడీ గెలిస్తే ఇండియా వదిలి వెళతానని గతంలో ప్రకటించారు. ఇటీవల మెడీ ఘన విజయం సాధించిన అనంతరం 'ముందుగా నేను ప్రామిస్ చేసినట్లుగా ఇండియా వదిలి వెళతాను. ఎస్ఆర్‌కె మరియు ఇతరులు వారి ప్రామిస్ నిలబెట్టుకుంటారో లేదో నాకు తెలియదు. నేను మాత్రం నిలబెట్టకుంటాను' అంటూ వ్యాఖ్యాలు చేసారు.
షారుక్ ఖాన్ ను అంతా ఎస్ఆర్‌కె అని షార్ట్‌గా పిలుస్తారు. కమల్ ఆర్ ఖాన్ వ్యాఖ్యల్లో ఎస్ఆర్‌కె ప్రస్తావన రావడంతో షారుక్ ఖాన్ మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు పెద్ద దుమారం రేపాయి. ఎట్టకేలకు షారుక్ వివరణ ఇవ్వడంతో వివాదానికి తెరపడ్డట్లయింది.


Click it and Unblock the Notifications











