పవన్ కళ్యాణ్ అన్నీ వదిలేశాడు, త్రివిక్రమ్ క్యారెక్టర్ ఇవ్వనన్నాడు, మా కాళ్ల మీద పడొద్దు: శర్వానంద్
Recommended Video
శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రణరంగం'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈచిత్రం ఆగస్టు 15న విడుదలవుతున్న నేపథ్యంలో కాకినాడలో గ్రాండ్‌గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ... కాకినాడలో కూడా ఈ సినిమా షూటింగ్ చేశాం. అది మరిచిపోలేని అనుభూతి. 'రణ రంగం' సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఆగస్ట్ 15న ఈ చిత్రం మిమ్మల్ని అలరించడానికి వస్తోంది అన్నారు.

పవన్ కళ్యాణ్ గారి సింప్లిసిటీకి హాట్సాఫ్
‘‘ఈ రోజు నాకు మరిచిపోలేని రోజు. ఉదయం ఎయిర్ పోర్ పోర్టులో పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన సినిమా షూటింగులకు వెళ్లేవాడిని. ఈ రోజు ఆయన్ను ఎయిర్ పోర్టులో కలవగానే ‘‘ఏం శర్వా ఎలా ఉన్నావ్... బావున్నావా.. నువ్వు సినిమాల్లోకి రాకముందు కలిశాను, మళ్లీ ఇపుడే కలుస్తున్నాను. బాగా చేస్తున్నావ్.. ఆల్ ది బెస్ట్'' అన్నారు. నేను అప్పుడెప్పుడో కలిసింది గుర్తు పెట్టుకుని పేరుతో పిలిచి మాట్లాడటం ఆనందంగా అనిపించింది. ఆయన సింప్లిసిటీకి హాట్సాఫ్. థాంక్సూ సర్.. యు మేడ్ మై డే టుడే.''

మన కోసం అన్నీ వదులుకుని వచ్చారు
‘‘పవన్ కళ్యాణ్ గారు ఇంత సింపుల్‌గా మనతో పాటు ఎకానమీలో ట్రావెల్ చేస్తున్నారేంటి? ఆయన పవర్ స్టార్ కదా ప్రైవేట్ జెట్లలో వస్తారని అనుకున్నాను అని హీరోయిన్ కళ్యాణి అడిగితే ఒకటే చెప్పాను. ఆయన అవన్నీ వదులుకుని మనందరి కోసం వచ్చారు అన్నాను. మనం ఆయన దగ్గర సింప్లిసిటీ నేర్చుకోవాలి, ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారు'' అని శర్వానంద్ వ్యాఖ్యానించారు.

త్రివిక్రమ్ గారు నాకు క్యారెక్టర్ ఇవ్వను అన్నారు
‘‘ఈ రోజు మరిచిపోలేని రోజు అని ఎందుకు అంటున్నానంటే... నేను సినిమాల కోసం, సినిమాల్లో క్యారెక్టర్ల కోసం ట్రై చేస్తున్న సమయంలో త్రివిక్రమ్ గారు అప్పటికీ ఇంకా డైరెక్టర్ అవ్వలేదు. పెద్ద రైటర్... తరచూ ఆయన్ను కలుస్తూ ఉండేవాడిని. సర్ ఏమైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అంటే... ఆయన ఒకటే చెప్పారు. నీతో చేస్తే కచ్చితంగా హీరోగా చేస్తా, క్యారెక్టర్ అయితే ఎప్పటికీ ఇవ్వను అన్నారు. ఆయన చెప్పినమాట నాకు ఇప్పటికీ గుర్తుంది.'' అని శర్వానంద్ చెప్పుకొచ్చారు.

మా కాళ్ల మీద కాదు, మీ తల్లిదండ్రుల కాళ్ల మీద పడండి
శర్వానంద్ మాట్లాడుతుంటే ఓ అభిమాని స్టేజీ మీదకు దూసుకొచ్చి.... కాళ్ల మీద పడ్డారు. ఈ ఘటనపై శర్వానంద్ స్పందిస్తూ... ‘‘దయచేసి ఎవరూ కాళ్ల మీద పడటం చేయొద్దు. మీరు పడాల్సింది మా మీద కాదు... మీ తల్లిదండ్రుల కాళ్ల మీద పడండి. ఇది మంచి కల్చర్ కాదు. మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. దయచేసి అలా చేయొద్దు.'' అన్నారు.


Click it and Unblock the Notifications











