మహేష్ బాబు ని కలిశాను కానీ,...: శేఖర్ కమ్ముల
హైదరాబాద్ : మహేశ్‌ని కలిశాను కానీ, మేము కలిసి సినిమా చేసేంతగా ఆలోచనలు జరగలేదు. నాక్కూడా స్టార్లతో పనిచేయాలనే ఉంది. నేను స్టార్‌లతో చేస్తే కచ్చితంగా అది ఓ మేజిక్కే అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు శేఖర్ కమ్ముల. ఆయన తన తాజా చిత్రం కహానీ రీమేక్ నేపద్యంలో మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే..ఇప్పుడు స్టార్‌ల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. కొత్తదనానికి ఆహ్వానం పలుకుతున్నారు. మనం తినే ప్రతి బియ్యపుగింజ మీద మన పేరు ఉంటుందన్నట్టుగానే, మన స్క్రిప్టు మీద కూడా ఎవరు చేయాలో రాసిపెట్టి ఉంటుందేమో అన్నారు.
ఇక కహానీ రీమేక్ గురించి చెపుతూ... కహానీ చిత్రంతో మీకు కొత్త శేఖర్‌కమ్ముల కనిపిస్తాడు. 'కహానీ'ని యథాతథంగా తీయడంలేదు. చాలా మార్పులూ చేర్పులూ చేస్తున్నాం. 'కహానీ'లో కోల్‌కతా నేపథ్యాన్ని, ఇక్కడ పాత బస్తీ నేపథ్యంగా మారుస్తున్నా. వేగంగా 45 పనిదినాల్లో పూర్తి చేయబోతున్నా. మార్చి నెలాఖరు నుంచి చిత్రీకరణకు సిద్ధమవుతున్నాం. అలాగే నేనిప్పటివరకూ డిజిటల్‌లో పనిచేయలేదు. దీన్ని అత్యాధునిక డిజిటల్ కెమెరాతో షూట్ చేయబోతున్నాం. రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్క్రిప్టువర్క్ చేస్తున్నారు అన్నారు.
సొంత కథలతో సినిమా చేసుకునే తనకు హిందీ చిత్రం 'కహానీ'ని రీమేక్ చేయాలని అనిపించటానికి కారణం చెపుతూ... నిజం చెప్పాలంటే అది నా ఆలోచన కాదు. బిగ్ బ్రదర్, బిగ్‌బాస్ లాంటి రియల్టీ షోలకు సూత్రధారి అయిన 'ఎండోమాల్' అనే కార్పోరేట్ సంస్థ తెలుగులో 'కహానీ'ని రీమేక్ చేయమంటూ నన్ను సంప్రదించింది. నా శైలికి పూర్తి భిన్నంగా ఏదైనా థ్రిల్లర్ చేయాలనే ఆలోచన నాలో కొంతకాలంగా ఉంది. అందుకే 'కహానీ' రీమేక్‌కు అంగీకరించా. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చేయబోతున్నా అన్నారు.


Click it and Unblock the Notifications











