సీనియర్ నటుడి ఆత్మాహత్యయత్నం.. ప్రాణాలు కాపాడిన ప్రకాశ్ రాజ్
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ది భిన్నమైన మనస్తత్వం. సినీ జీవితానికే పరిమితం కాకుండా సమాజం గురించి ఆలోచించే వ్యక్తిగా సమకాలీన విషయాలపై, సమస్యలపై ఎన్నోసార్లు తన స్పందనను వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ఆయనను కొన్ని విషయాలు వివాదాల్లోకి నెట్టాయి. తాజాగా ఆర్థిక కష్టాల్లో ఉన్న ఓ సీనియర్ నటుడి ప్రాణాలను ప్రకాశ్ రాజ్ కాపాడారనే విషయం ఆయన మానవత్వానికి సాక్ష్యంగా నిలిచింది. ఇంతకు ఏం జరిగిందంటే..

సామాజిక సమస్యలపై
నటుడు ప్రకాశ్ రాజ్ అంటే మనకు సోషల్ మీడియాలో బీజేపీని విమర్శించడం, ప్రధాని నరేంద్రమోడీ విధానాలను దుయ్యబట్టడం చూస్తూనే ఉంటాం. కాషాయ రంగు అంటే చిరాకు పడేలా కనిపిస్తారు. హిందుత్వం పేరుతో ప్రజలను విడగొట్టడాన్ని తీవ్రంగా, బహిరంగంగా వ్యతిరేకించడం చూస్తూనే ఉంటాం. కానీ ఆయనలో మరో కోణం ఉందనే విషయం తాజా సంఘటనకు నిదర్శనంగా నిలిచింది.

మానవత్వాన్ని ప్రదర్శించి
కానీ అలాంటి ప్రకాశ్ రాజ్‌కు సంబంధించి ఓ భిన్నమైన వ్యక్తిత్వాన్ని నటుడు శివాజీరాజా బయటకు తీసుకొచ్చారు. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్‌లోని ఓ సినియర్ నటుడు ఆర్థికంగా చితికిపోయారు. తీసుకొన్న రుణాలు కట్టే పరిస్థితి లేదు. దాదాపు రూ.50 లక్షల రుణాన్ని చెల్లించాల్సిన భారం ఉంది. ఆ సమయంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు అని శివాజీ రాజా చెప్పారు.

చెలించిన ప్రకాశ్ రాజ్
తన తోటి నటుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించారనే వార్త తెలుసుకొన్న ప్రకాశ్ రాజ్ చెలించిపోయారు. ఆ వ్యక్తిని తీసుకురమ్మని నాకు చెప్పారు. ప్రకాశ్ రాజ్ కోరిక మేరకు ఆ సీనియర్ నటుడిని అతడి వద్దకు తీసుకెళ్లాను. అతడికి సూసైడ్ చేసుకోవద్దని కౌన్సిలింగ్ ఇచ్చాడు. తన అప్పు మొత్తాన్ని తీర్చే భారాన్ని తనపై వేసుకొని ఆయనను ఆదుకొన్నారు అని శివాజీ రాజా తెలిపారు.

పేరు చెప్పడానికి నిరాకరించి..
ప్రకాశ్ రాజ్ ఆదుకొన్న సీనియర్ నటుడి పేరును వెల్లడించడానికి శివాజీ రాజా నిరాకరించారు. ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ సహాయం చేసిన దానిని చెప్పుకోవడానికి ప్రయత్నించరు. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన మానవత్వం ప్రకాశ్ రాజ్‌ది అంటూ శివాజీ రాజా ఉద్వేగానికి గురయ్యారు.
Recommended Video

రజనీకాంత్‌తో ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్ కెరీర్ విషయానికి వస్తే.. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాతే చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సురుథాయి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, నయనతార, మీనా, కుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











