RRRకి షాక్.. ఇలా చేయడం రాజమౌళికి తగదంటూ అల్లూరి యువజన సంఘం లేఖ
ఈ మధ్యకాలంలో చారిత్రక సినిమాలకు బాగా డిమాండ్ పెరగడంతో అలాంటి సినిమాలు తీసేందుకే మొగ్గు చూపుతున్నారు దర్శకనిర్మాతలు. ఇదే బాటలో దర్శకధీరుడు రాజమౌళి కూడా ప్రయాణిస్తున్నారు. భారీ మల్టీస్టారర్ సినిమాగా RRRని వెండితెర మీదకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంతలో RRR సినిమాపై ఊహించని విధంగా అభ్యంతరం వ్యక్తం కావడం హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

మెగా, నందమూరి అభిమానులకు షాక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ రేంజ్‌లో తెరకెక్కుతోంది RRR మూవీ. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుంటే, కొమురం భీం పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నారు. ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఈ ఇద్దరిపై షూటింగ్ చేస్తూ వస్తున్నారు జక్కన్న. ఇంతలో ఈ సినిమాపై అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేయడం మెగా, నందమూరి అభిమానులకు షాకిచ్చింది.

ఆర్డీవోకు వినతి పత్రం.. రాజమౌళికి తగదు
అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు RRR సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నర్సీపట్నం ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చారని తెలిసింది. సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించడం దర్శకుడు రాజమౌళికి తగదని వీరభద్రరావు తన వినతి పత్రంలో పేర్కొన్నట్లుగా సమాచారం.

రాజమౌళి ప్రయత్నం అదే..
అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం జిల్లాలోని పాండ్రంకిలో పుట్టి.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7 వ తేదీన బ్రిటీషు సైనికుల కాల్పుల్లో వీరమరణం పొందారని, కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోందని వీరభద్రరావు అంటున్నారు. వీరిద్దరికీ స్నేహం ఎలా ఏర్పడిందో చరిత్రలో ఎక్కడా కనిపించడం, చరిత్రలో లేని విషయాన్ని రాజమౌళి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని వీరభద్రరావు ఆరోపణ.

వెంటనే చర్యలు తీసుకోవాలి..
ఈ మేరకు.. చరిత్రను వక్రీకరించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ నర్సీపట్నం ఆర్డీవోకు ఇచ్చిన వినతి పత్రంలో వీరభద్రరావు పేర్కొన్నట్లుగా తెలిసింది. దీంతో అంతా సవ్యంగా సాగుతోందనుకున్న ఈ తరుణంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లయింది. చూడాలి మరి దీనిపై రాజమౌళి స్పందన ఎలా ఉంటుందనేది.

RRR మూవీ
తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో కూడా భారీగా విడుదలవుతుంది RRR మూవీ. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. చిత్రంలో అజయ్ దేవగన్, ఆలియా భట్ లాంటి బాలీవుడ్ తారాగణం భాగమవుతోంది. 2020 జులై 30న RRR ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











